ప్రముఖ సినీ హీరో మోహన్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ పోలీసులు ఆయన ఇంటిని ముట్టడించారు. ఆయనను ఇంట్లో నిర్బంధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి మోహన్ బాబు ను తిరుపతిలోని తన నివాసంలో ఆంధ్రా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మోహన్ బాబు తన విద్యాసంస్థలో చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థులందరితో కలిసి ఆయన తిరుపతిలో నిరసన ర్యాలీ చేయాలని నిర్ణయించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఎన్నికల సమయంలో నిరసన ర్యాలీకి అనుమతి లేదని, అందుకే మోహన్ బాబును కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసన ర్యాలీ చేయకుండా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల హెచ్చరికలను లెక్కచేసేదిలేదని మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. తన విద్యార్థుల కోసం నిరసన ర్యాలీ చేసి తీరుతానని ఆయన చెబుతున్నారని సమాచారం. దీంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక విఐపి గా ఉన్న మోహన్ బాబు నిరసన ప్రదర్శన చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి ఉండాలని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం అనుమతి లేకపోతే మోహన్ బాబును కదలనిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నాయి.
ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే అవకాశాలున్నాయా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఆయన యాక్టీవ్ పొలిటీషియన్ గా ఉన్నారు. మరి మళ్లీ ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది కూడా ఈ సందర్భంగా తేలనుందని ఆయన అభిమానులు అంటున్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/lokesh-makes-another-mistake/