గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ ల పర్వం కొనసాగుతూ ఉంది. అభ్యర్థుల్ని కేటాయించకముందు టికెట్ ఆశించి భంగపాటుకు గురైన నేతలు టికెట్ కోసమో లేదా మరేదైనా హామీ తీసుకుని అవతలి పార్టీలోకి జంప్ అయ్యారు. కాగా ఇటు అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభర్ధుల పూర్తి జాబితాను విడుదల చేశారు.
ఈ తరుణంలో అప్పటివరకు టికెట్ మీద ఆశలు పెట్టుకున్న నేతలు చివరికి అది దక్కకపోవడంతో కండువాలు మార్చుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైసీపీలో కలవరం మొదలైంది. బుధవారం నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
2014 ఎన్నికల్లో ఐజయ్య వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి లబ్బి వెంకటస్వామిపై సుమారు 22,000 ఓట్ల భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కుతుందని భావించారు. కానీ జగన్ ఆయన్ని కాదని ఆర్ధర్ కి టికెట్ కేటాయించడంతో ఐజయ్య మనస్థాపానికి గురయ్యారు.
అయితే గతంలోనే ఐజయ్య పార్టీ మారతారని వార్తలు వినిపించాయి. కానీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత వైసీపీలో టికెట్ దక్కని నేపథ్యంలో ఆయన టీడీపీ గూటికి చేరారు. కాగా ఈసారి నందికొట్కూరులో టీడీపీ అభ్యర్థిగా బండి జయరాజుకు అవకాశం కల్పించింది అధిష్టానం. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానని పార్టీలో చేరిన సందర్భంగా వెల్లడించారు ఐజయ్య.