టెస్టు క్రికెట్ లో బోణీ కొట్టిన ఆఫ్ఘన్ జట్టు

(బి.వేంకటేశ్వర మూర్తి)

డెహ్రాడూన్ : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్టు విజయాన్ని సాధించింది. డెహ్రాడూన్ లో ఐర్లాండ్ తో జరిగిన ఏకైక టెస్టులో సోమవారం నాలుగో రోజున ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.

రెండో ఇన్నింగ్స్ లో 147 పరుగుల లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఆఫ్ఘన్, జేమ్స్ కామరూన్ వేసిన బంతిని హష్మతుల్లా షాహిది ఫోర్ కొట్టడంతో టెస్టు క్రికెట్ లో తనదంటూ ఓ చరిత్ర సృష్టించింది.

టెస్ట్ క్రికెట్ లో ఐర్లాండ్ తో పాటు పసిపాప అయిన ఆఫ్ఘన్ రెండో మ్యాచ్ లోనే విజయం సాధించడం ద్వారా చరిత్రలో ఇంగ్లండ్, పాకిస్తాన్ ల సరసన చేరింది. ఆడిన తొలి టెస్టులోనే గెలిచిన ఆస్ట్రేలియా మాత్రమే ఇంతకంటే మెరుగైన రికార్డును సాధించగలిగింది. వెస్టిండీస్ ఆరవ, జింబాబ్వె 11వ, దక్షిణాఫ్రికా 12వ, శ్రీలంక 14వ టెస్టుల్లో తొలి విజయాలను నమోదు చేశాయి. మొట్టమొదటి టెస్టు విజయంలో ఇండియా (25), బంగ్లాదేశ్ (35),  న్యూజిలాండ్ (45)ల రికార్డు మరీ అధ్వాన్నంగా ఉంది.

ఆఫ్ఘనిస్తాన్ తన మొట్టమొదటి క్రికెట్ టెస్టులో బెంగుళూరులో భారత జట్టు చేతిలో ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఓడిపోయింది.

వన్ డే ఇంటర్నేషనల్, టి ట్వంటీల్లో కూడా ఆఫ్ఘన్ తొలి విజయాల రికార్డు అద్భుతంగానే ఉంది. ఆడిన మొదటి వన్ డే లోనే స్కాట్లాండ్ పై 89 పరిగుల తేడాతో గెలిచింది (బెనోని -ఏప్రిల్ 2009). ఆడిన రెండో టి ట్వంటీలో కెనడాపై ఐదు వికెట్లతో గెలిచింది. (కొలంబో -ఫిబ్రవరి 2010).

డెహ్రాడూన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. డోక్రెల్ 39 పరుగులు చేయగా, నంబర్ 11 బ్యాట్స్ మన్ ముర్టాగ్ 54 పరుగులతో అజేయంగా మిగలడం విశేషం. అహ్మద్ జై, నబీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా,  రషీద్ ఖాన్, వకార్ సలామ్ ఖైల్ చెరో రెండు వికెట్లు పతనం చేశారు. రహమత్ (98),  షాహిదీ(61)., అస్గర్ ఆఫ్ఘన్ (67) ల దీటైన బ్యాటింగ్ తో ఆఫ్ఘనిస్తాన్ 314 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో కాస్త మెరుగ్గా ఆడినప్పటికీ 288 పరుగులకు ఆలౌటయింది. ఆండీ బాల్ బిర్నీ 82, కెవిన్ ఓబ్రియన్ 56 పరుగులు చేశారు. నంబర్ లెవెన్ బ్యాట్స్ మన్ ముర్టాగ్ మరోసారి 27 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. నంబర్ లెవెన్ బ్యాట్స్ మన్ రెండు ఇన్నింగ్స్ లోనూ 25 దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. సంచలన స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ 82 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు రెండు ఇన్నింగ్స్ లోనూ దీటుగా బ్యాటింగ్ చేసిన రహ్మత్ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెల్చుకున్నాడు.

(మూర్తి, సీనియర్ జర్నలిస్టు, బెంగూళూరు)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *