వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సమరశంఖారావ సభలోనే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఈ ప్రకటన మార్చ్ 16 కి వాయిదా పడింది. కాగా అనూహ్య రీతిలో జగన్ బాబాయ్, సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య గావింపబడ్డారు. దీంతో ఇడుపులపాయలో ఈరోజు ఉదయం జరగాల్సిన అభ్యర్థుల ప్రకటన కార్యక్రమం ఈరోజు సాయంత్రానికి వాయిదా పడింది. మరి కాసేపట్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
అభ్యర్థుల ప్రకటనను రేపటికి వాయిదా వేశారు జగన్. దివంగత సీఎం, తన తండ్రి వైఎస్సార్ కి ఇడుపులపాయలో నివాళులర్పించి అక్కడి నుండి ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టడం జగన్ కి సెంటిమెంట్. అయితే బాబాయ్ హత్య గురించి ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కి వివరించి సిబిఐ ఎంక్వయిరీ కోరేందుకు జగన్ హైదరాబాద్ వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వలన జగన్ ఇప్పుడు ఇడుపులపాయ వెళ్లట్లేదని, అందుకే ప్రకటనను రేపటికి వాయిదా వేశారని తెలిసింది.
రేపు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయ చేరుకోనున్నారు జగన్. అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. అనంతరం ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. నర్సీపట్నం, పీ.గన్నవరం లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు జగన్. దీంతో ఎప్పుడెప్పుడు జగన్ వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్న వైసీపీ శ్రేణులకు నిరాశ మిగిలింది. ఆశావహుల్లో, వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
Super jai jaganaan