ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తమ్ముడు, ప్రముఖ రాజకీయ నేత వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారు. పులివెందులలోని ఆయన సొంత నివాసంలో తెల్లవారుఝామున కన్నుమూశారు వివేకానందరెడ్డి. ఆయన మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిన్నరాత్రి వరకు కడప జిల్లా మైదుకూరులో వైసీపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేకానందరెడ్డి. అనంతరం నేరుగా పులివెందులలోని ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుఝామున వాంతులు రావడంతో బాత్రూం కి వెళ్లిన వివేకానందరెడ్డి, అక్కడే గుండెపోటుతో కుప్పకూలినట్టు తెలుస్తోంది. గుండెపోటుకు గురైన సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నట్టు సమాచారం. శవ పరీక్ష నిమిత్తం ఆయన మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆయన మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పులివెందులకు భారీగా చేరుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి మంత్రిగా ఎంపీగా మరియు ఎమ్మెల్సీగా పని చేశారు. 1999లో తొలిసారి ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు.