వైస్ వివేకానంద రెడ్డి 1950 ఆగష్టు 8 న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చిన్న తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి.
లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించి సమితి ప్రెసిడెంటుగా ఎదిగారు.
కడప జిల్లాలోని లింగాల కాలువను డిజైన్ చేశారు వివేకానందరెడ్డి.
1989, 1994 లో రెండుసార్లు పులివెందుల నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి.
1999 లో కడప లోక్ సభకు పోటీ చేసిన ఆయన రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 90,000 మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు.
2004 లో కడప లోక్ సభకు పోటీ చేసి 1,10,000 మెజారిటీతో గెలుపొందారు.
2009 లో ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన 2010 నవంబరులో కిరణ్ కుమార్ రెడ్డి కాబినెట్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2011 ఉపఎన్నికల్లో పులివెందుల నుండి వైఎస్ విజయమ్మపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
అనంతరం ఆయన వైసీపీలో చేరి జగన్ కు మద్దతుగా నిలిచారు. బాబాయ్ కొడుకులు కలవడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో చేరినప్పటి నుండి జగన్ గెలుపు కోసం కృషి చేస్తూ వచ్చారు వివేకానందరెడ్డి.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా సరే… ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్న కొడుకుని సీఎం చేయాలి అనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. నిన్న కూడా ఆయన వైసీపీ తరపున మైదుకూరులో రాత్రి వరకు ప్రచారం చేశారు అనంతరం పులివెందులలోని ఇంటికి చేరుకున్న ఆయన తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. సౌమ్యుడిగా పేరున్న ఆయన మరణం కుటుంబీకులకు, సన్నిహితులకు, అభిమానులకు విషాదాన్ని మిగిల్చింది.