కాంగ్రెస్ పార్టీలో మరో కల్లోలం చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.
సుధీర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారంటూ ట్రెండింగ్ తెలుగు న్యూస్ లో శుక్రవారం ఉదయమే కథనాన్ని ప్రచురించింది. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ తో సుధీర్ రెడ్డి సమావేశమైన వివరాలను వెల్లడించింది.
అయితే సుధీర్ రెడ్డి అనుచరులు, సన్నిహితులు ఈ విషయాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. సుధీర్ రెడ్డి పార్టీ మారే సమస్యే లేదని చెప్పారు. కానీ శుక్రవారం సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరికపై వివరణ ఇచ్చారు.
ఆయన ఏమన్నారో చదవండి….
నేను కేటీఆర్ ను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం నిజమే. కేటిఆర్ ను ఇవాళ కలిశాను. అన్ని అంశాలపై చర్చించాను.
మరో రెండు,మూడు రోజుల్లో కేసీఆర్ ను కూడా కలవబోతున్నాను. నేను కాంగ్రెస్ వీడి టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను.
నియోజకవర్గ అభివృద్ధి పై కేటీఆర్ పూర్తి స్థాయి హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణ .. బిఎన్ రెడ్డి కాలనీలో రిజిస్ట్రేషన్స్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ఎల్బీనగర్ ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నేను కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. పై విషయాలను సుధీర్ రెడ్డి మీడియాకు చేరవేశారు.
నిన్న కందాల, నేడు సుధీర్ రెడ్డి, రేపు వనమా…
రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని చేపట్టిన గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ చేస్తోంది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నిన్న కేటిఆర్ తో కలిసి టిఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తిని ప్రదర్శించారు. నియోజకవర్గ బాగు కోసమే టిఆర్ఎస్ లో చేరాలని ఆశతో ఉన్నట్లు ప్రకటించారు. కేటిఆర్ కు ఒక మొక్క ఇచ్చి టిఆర్ఎస్ లో చేరతానని స్పష్టం చేశారు.
ఇక కందాల ఉపేందర్ రెడ్డి వ్యవహారం ఇలా సాగుతున్నవేళ సుధీర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన సైతం కేటిఆర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు కూడా టిఆర్ఎస్ లో చేరాలన్న ఆసక్తి ఉందని ప్రకటించారు. నియోజకవర్గానికి మేలు చేకూర్చడం కోసమే చేరుతున్నట్లు తెలిపారు.
ఇక వీరిద్దరి పరిస్థితి ఇలా ఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా సీన్ లోకి ఎంటరయ్యారు. ఆయన కూడా రేపో మాపో ఆయన కూడా గులాబీ కారెక్కడం ఖాయంగా కనబడుతున్నది. ఇప్పటికే ఆ దిశగా వనమా సంప్రదింపులు జరిపినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరవచ్చని ప్రచారం సాగుతోంది. ఆయన లోలోపల ప్రయత్నాలు అన్నీ నడుస్తున్నాయని అతి త్వరలోనే ఆయన కూడా ఓపెన్ స్టేట్ మెంట్ ఇస్తారని చెబుతున్నారు.
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేదెవరు?
ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో మిగిలేదెవరు? కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేదెవరు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కాంగ్రెస్ లో మహా అంటే అర డజను మంది ఎమ్మెల్యేలకు మించి ఉండే చాన్సే లేదని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతు చేయడమే లక్ష్యంగా గులాబీబాస్ కేసిఆర్ స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చివరి వరకు కాంగ్రెస్ లో కొనసాగే ఎమ్మెల్యేలు వీరే…
1 ఉత్తమ్ కుమార్ రెడ్డి
2 మల్లు బట్టి విక్రమార్క
3 ములుగు సీతక్క
4 గండ్ర వెంకట రమణారెడ్డి
5 డి.శ్రీధర్ బాబు
6 పైలెట్ రోహిత్ రెడ్డి
గులాబీ పార్టీలో చేరతామని చెప్పివారు..
1 రేగా కాంతారావు (పినపాక)
2 ఆత్రం సక్కు (ఆసిఫాబాద్)
3 చిరుమర్తి లింగయ్య (నకిరేకల్)
4 హరిప్రియా నాయక్ (ఇల్లెందు)
5 సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)
6 కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు)
7 వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం)
8 సుధీర్ రెడ్డి (ఎల్ బి నగర్)
పోతారని ప్రచారంలో ఉన్నవారు వీరే…
1 జగ్గారెడ్డి (సంగారెడ్డి)
2 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు)
3 పోదెం వీరయ్య (భద్రాచలం)
4 హర్షవర్దన్ రెడ్డి (కొల్లాపూర్)
5 సురేందర్ (ఎల్లారెడ్డి)