మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన మరణానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలుత ఆయన గుండెపోటుతో హఠాత్తుగా మరణించారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇది సహజ మరణం కాదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సన్నిహితులు, వైసీపీ శ్రేణులు.
ఈమేరకు వివేకా మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పిఎ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఒక ఫిర్యాదు లేఖను సమర్పించారు. ఈ లేఖలు పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వివేకా పిఎ కృష్ణారెడ్డి. ఇంతకీ ఆ లేఖలో ఏముందో తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి. ఫిర్యాదు లేఖ కూడా కింద ఉంది చూడవచ్చు.
“ఎం.వి.కృష్ణారెడ్డి వ్రాయునది ఏమనగా నేను ఈ రోజు ఉదయం 5:30 గంటలకు వైఎస్ వివేకానందరెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. కానీ అప్పటికి సార్ నిద్ర లేవలేదు. నేను ఒక అరగంటసేపు పేపర్ చదివిన తర్వాత ఆయన భార్య సౌభాగ్యమ్మగారికి ఫోన్ చేసి… సార్ నిద్ర లేవలేదు. నేను నిద్ర లేపుతాను అని చెప్పాను. అందుకు ఆవిడ…సార్ రాత్రి లేటుగా వచ్చి ఉంటారు, నిద్ర లేపవద్దు అని చెప్పారు.
తర్వాత అరగంటకు వంట చేసే లక్షి మరియు వారి కుమారుడు ప్రకాష్ వచ్చారు. అప్పుడు నేను లక్ష్మితో… సార్ అరుస్తారు నిద్ర లేపమని చెప్పాను. లక్ష్మి ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అని చెప్పింది. తర్వాత నేను పోయి పిలిచాను. కానీ అప్పటికీ లేవలేదు. తర్వాత మా వాచ్ మ్యాన్ రంగన్న సైడ్ డోర్ తెరిచి ఉంది అన్నాడు. అప్పుడు నేను, ప్రకాష్ ఇద్దరం ఒకేసారి లోపలికి వెళ్ళాము.
బెడ్ రూమ్ డోర్ కూడా ఓపెన్ ఉంది. బెడ్ రూమ్ దగ్గర దాదాపు రెండు లీటర్ల బ్లడ్ పడి ఉంది. కానీ సార్ లేడు. తర్వాత బాత్ రూమ్ లో చూస్తే అక్కడ బ్లడ్ లోనే కింద పడి ఉన్నారు. తర్వాత చెయ్యి పట్టుకుని చూస్తే నాడి పని చెయ్యట్లేదు. తల నుదుటిపైన, తల వెనక, అరచేతికి గాయాలు ఉన్నాయి. నేను ప్రకాష్ తో మన సార్ లేరు అని చెప్పి బయటకు వచ్చి, సార్ అల్లుడు ఎన్.రాజాగారికి మరియు సౌభాగ్యమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. మరణానికి కారణమూ తెలియదు” అని కృష్ణారెడ్డి తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.
కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు పులివెందుల పోలీసులు. రంగంలోకి డాగ్ స్క్వాడ్ ని దింపారు. పలువురి నుండి వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా మృతిలో కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.