మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత ఆయన గుండెపోటుతో మరణించారు అని వార్తలు వచ్చాయి. మరికొద్దిసేపటికి ఆయన మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని వివేకా పిఎ పోలీసులను ఆశ్రయించడంతో కొత్త కోణం వెలుగు చూసింది. అప్పటివరకు ఆయనది సహజ మరణం అనుకున్నవారంతా అవాక్కయ్యారు.
ఆయన తలకి, చేతికి బలమైన గాయాలున్నాయని, ఆయన శవం రక్తపు మడుగులో ఉందని ఇది సహజ మరణం కాదని కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే వివేకా మరణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విచారణ చేపట్టిన పోలీసులు కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం కత్తి పోట్లు ఉన్నాయి అని, హత్య అని నిర్ధారణకు వచ్చారు. కాగా ఈ కేసుపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పందించారు.
వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ప్రత్యేకంగా ఫోరెన్సిక్ నిపుణులను పిలిపిస్తున్నామని పేర్కొన్నారు.
ఘటనాస్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. కేసును సీరియస్ గా తీసుకున్నామని, విచారణలో ఎవరి పాత్ర అయినా ఉందని తేలితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.