(బివి మూర్తి )
ఇప్పుడిక ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) హడావుడి ఆరంభమవుతున్నది. అన్ని ఐపిఎల్ జట్లలోనూ అనేక మంది భారత క్రికెటర్లతో పాటు ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా అన్ని క్రికెట్ దేశాల ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే తమ తమ దేశాల జట్లలో పాతుకుపోయిన క్రికెటర్లతో పాటు వెర్రిమొర్రి ఆశలతో స్థానం కోసం ఇప్పటికీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. భారత ప్రపంచకప్ జట్టు దాదాపు ఖాయమైనట్టేనని కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, సెలెక్షన్ కమిటీ సభ్యులూ ఢంకా బజాయించి గట్టి గా చెబుతున్నారు.
ఎవరేన్ని చెప్పినా 15 మంది సభ్యుల భారత జట్టులో ఇప్పటికీ ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. మే నెలలో జరిగే ప్రపంచకప్ నాటికి గాయాలూ, ఆయా క్రికెటర్ల ఫామ్ ని బట్టి సెలెక్షన్ కమిటీ భారత జట్టు సభ్యులపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఐపిఎల్ టోర్నీ ఇంకో వారంలో ఆరంభమవున్నది. భారత ప్రపంచ కప్ క్రికెట్ జట్టు ఎంపికకూ ఐపిఎల్ టోర్నీకీ ఏ విధమైన సంబంధం లేదనీ, జట్టులో ప్రధాన సభ్యుల ఎంపిక ఈ సరికే పూర్తయ్యిందనీ కోహ్లి, శాస్త్రి బృందం చెబుతున్నప్పటికీ తుది జట్టుపై ఉత్కంఠ ఇంకో నెలన్నర పాటు కొనసాగక తప్పదు. శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి, సెలెక్టర్ల దృష్టి నాకర్షించి తమ తమ జాతీయ జట్లలో స్థానం సంపాదించడానికీ, భిన్న విభిన్నమైన జట్లతో ఆడటం ద్వారా ప్రతిభా పాటవాలు మెరుగు పర్చుకోడానికీ అన్ని దేశాల ఆటగాళ్లకీ ఐపిఎల్ ఓ అద్భుతమైన వేదిక.
కోట్లలో పలికే వేలం పాటలూ, బౌండరీలు, సిక్సర్ లకు సైతం లక్షలాది రూపాయల పారితోషికాలతో ఆటగాళ్ల నెత్తిన కనకవర్షం కురిపించే టోర్నీ గనుక ప్రతి మ్యాచ్ లోనూ ఇక్కడ క్రికెట్ విన్యాసాల పోటీ కూడా చాలా తీవ్రంగానే ఉంటుంది. అంతే కాదు, విభిన్న శైలి బౌలర్లను ఎదుర్కొని చీల్చి చెండాడడానికి బ్యాట్స్ మెన్ కూ, ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ వీరప్రహారాల ఎదురు దాడుల్ని తట్టుకుని నిలబడి సత్తా చూపేందుకు పొడుగు చేతుల జాణ బౌలర్లకూ అంతర్జాతీయ ఐపిఎల్ టోర్నీ చక్కని అవకాశాలు అందిస్తున్నది. ఇంతటి హోరాహోరీ బాహాబాహీ సమరం కనుకనే ఇందులో గాయాల బెడద కూడా బాగా ఎక్కువే. అందువల్లే ప్రపంచ కప్ భారత జట్టు ఎంపికకీ ఐపిఎల్ టోర్నీకి అస్సలు సంబంధం లేదనే స్టేట్ మెంట్ లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదు.
ఐపిఎల్ టోర్నీలో ఆడటాన్ని ’ఎంజాయ్’ చేయవలసిందిగా తన జట్టు సహచరులకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సలహా ఇచ్చాడు. ఐపిఎల్ వర్క్ లోడ్ ను మేనేజ్ చెయ్యడం కోసం భారత ఆటగాళ్లు ఎవరికి వారు తమ తమ టీమ్ మేనేజ్ మెంట్ లతో అవగాహనకు రావాలని అతనంటున్నాడు.
ఈ ` వర్క్ లోడ్ ఎక్కువ కావడం’ అన్న భావన ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నది. నిరాఘాటంగా ఒక్క మ్యాచ్ కూడా మిస్సవకుండా బౌలింగ్ బాధ్యతలను మొత్తం తన భుజాల మీదే మోసిన కపిల్ దేవ్ లాంటి పాత తరం క్రికెటర్ లకు ఈ వర్క్ లోడ్ కాన్సెప్ట్ కొత్తగా వినిపించ వచ్చు కానీ నేటి పరిస్థితుల దృష్ట్యా టాప్ క్రికటెర్లకు అప్పుడప్పుడూ ఆటవిడుపు అవసరమే అనిపిస్తుంది. ఇటీవలే జరిగీన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా హోమ్ సిరీస్ లో భారత టీమ్ మేనేజ్ మెంట్ కెప్టెన్ కోహ్లి, సీనియర్ వికెట్ కీపర్ ధోనీ, స్ట్రైక్ బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లకు అడపా దడపా రెస్ట్ ఇస్తూ వచ్చింది. ఆటగాళ్లలో జవసత్త్ల్వాలనూ, ఆట పట్ల నిబద్ధతను సజీవంగా ఉంచడానికి మధ్యే మధ్యే పానీయం ( జరుగుతున్న మ్యాచ్ తో ప్రమేయం లేకుండా సాక్షాత్తూ ఆట ఆడుతున్న వాళ్లకు నిర్ణీత సమయాల్లో, ఒక్కోసారి ప్రత్యేకంగా అవసరమైనప్పుడు డ్రింకులు తీసుకువెళ్లి అందించే) బాధ్యత చక్కగా ఉపకరిస్తుంది.
క్రికెట్ ఆడుతున్నప్పుడల్లా గాయాల బెడద అనివార్యమే కానీ, మధ్య మధ్య రెస్టు వల్ల, నిరంతర వర్క్ లోడ్ వల్ల సంక్రమించే వెన్ను నొప్పి, భుజం నొప్పి వంటి కొన్ని గాయాలను చాలా వరకు తగ్గించడం సాధ్యమవుతుంది.
(బివి మూర్తి, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు, బెంగళూరు)