తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గులాబీ ముల్లు దెబ్బకి హస్తం విలవిలలాడుతోంది. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నాయకులు పోటీపడి మరి కారెక్కుతున్నారు. కారు ధాటికి తెలంగాణ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తలకిందులవుతోంది.
ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్య గులాబీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే అధికారికంగా వీరు ఇంకా పార్టీ మారలేదు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆరెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. త్వరలోనే వీరంతా టీఆరెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. కాగా వీరి బాటలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే చేరబోతున్నట్టు సమాచారం.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆరెస్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ శుక్రవారం ఆయన సీఎం క్యాంపు ఆఫీస్ లో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ కానున్నట్టు టీఆరెస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చర్చలు సఫలీకృతమైతే ఆయన టీఆరెస్ పార్టీలోకి చేరతారంటూ ముఖ్యవర్గాల సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలినట్టైంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తెలంగాణాలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతున్నాయి. నేతలు వరుసపెట్టి పార్టీ మారేందుకు సిద్ధమవుతుండటంతో తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయ్యింది.