దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ఇటీవలే ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హితేష్ కి పర్చూరు టికెట్ ఆశించి వారు వైసీపీలో చేరారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఆ సెగ్మెంట్ హితేష్ కి ఫిక్స్ చేశారు. అయితే సొంత నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్న హితేష్ కి చుక్కెదురైంది.
హితేష్ అమెరికా పౌరసత్వం ఆయన పోటీకి ఆటంకంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు తన పౌరసత్వం రద్దు చేసుకుంటానని, పర్చూరు టికెట్ తనకి ఇవ్వాలని హితేష్ జగన్ ని కోరారు. కానీ ఆయన ఆశించినట్టు జగన్ టికెట్ కన్ఫర్మ్ చేశారు కానీ అమెరికా పౌరసత్వం మాత్రం అనుకున్న టైముకి రద్దు కాలేదు. దీంతో దగ్గుబాటి కుటుంబానికి నిరాశ ఎదురైంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పర్చూరు టికెట్ విషయంలో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. పర్చూరు టికెట్ విషయంలో గతంలోనే వారి కుటుంబానికి హామీ ఇచ్చారు జగన్. హితేష్ పోటీ చేయకపోయినా దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పోటీ చేయమని సూచించినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లోనే కొడుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు నిరాశ చెందుతున్నారట. జగన్ చెప్పినట్టు పర్చూరు నుండి పోటీ చేసే విషయంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.