(కోసిక వినయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా జర్నలిస్ట్)
గ్యాంగ్ స్టార్ నయీమ్ ఈ పేరు ఒకప్పుడు సంచలనం. ఎన్నో రకాలుగా అక్రమ వసూళ్లు,సుపారీ తీసుకొని చేసిన నేరాలు, దారుణాలు కోకొల్లలు. అందులో పోలీసులు, నక్సలైట్ల కు వ్యతిరేకంగా చేసిన కార్యకలాపాలు తెలంగాణ లొనే కాకుండా ఇతర సరిహద్దు రాష్టాలలో కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నేర సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజులా తయారైన నయీమ్ మూడేళ్ల కిందట ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. ఆ తర్వాత నయీమ్ పేరు మాసిపోయింది. ఆ పేరు పెద్దగా వినపడిన సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ అతని ఆస్తుల మీద తను అక్రమంగా బెదిరించి రాయించుకున్న భూమి మీద ఎన్నో సందేహాలు మరెన్నో వివాదాలు. ఆ పుట్ట ఇప్పుడు పగిలింది.
నయీమ్ మృతి తర్వాత తన అనుచరులు ఏం చేస్తున్నారు? ఇంకా అక్రమ దందాలు నిర్వహిస్తున్నారా? అనే కోణంలో రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ విచారణ నిర్వహించగా ఎన్నో నమ్మలేని చీకటి నిజాలు ఆధారాలతో సహా వెలుగుచూశాయి. కొంత మంది బాధితులు నేరుగా కమిషనర్ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అందుకోసమే (ఎస్ ఓ టీ ) స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ను రంగంలోకి దింపి విచారణ చేయించారు సిపి మహేష్ భగవత్.
అసలు ఏం జరిగింది? విచారణలో ఏం తేలింది? అంటే గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ అయిన తరువాత భువనగిరి ప్రాంతంలో ఐదు ఎకరాలు బినామీ ఆస్తిని అమ్మకం జరపడానికి యత్నించిన నయీమ్ భార్య హసినా బేగం (38), పాశం శ్రీను (46), భువనగిరి మాజీ కౌన్సిలర్ మహ్మద్ అబ్దుల్ నాజర్ (40), పంచాయతీ కార్యదర్శి(నయీం సోదరుడు) ఫాయీమ్(45), భువనగరి మాజీ కౌన్సిలర్ తుమ్మల శ్రీనివాస్ (47) ప్రయత్నించారు. నయీమ్ బినామీ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు వీరు ప్రయత్నిస్తుండగా సోమవారం రాచకొండ పోలీసుల రహస్య విచారణ జరిపి వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
నయీమ్ బినామీ పేరిట ఉన్న భూ విక్రయాలకు, రిజిస్ట్రేషన్ చేసే విషయంలో సహకరించిన సబ్ రిజిస్ట్రార్ సహదేవ్‌ను ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నయీమ్ హతమైనా అతని అనుచరుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు, ఆతర్వాత చాలా మంది తమ భూములను నయీమ్ గ్యాంగ్ అక్రమంగా ఆక్రమించుకున్నది. దీనిపై నయీమ్ చావు తర్వాత బాధితులంతా భువనగిరి పట్టణంలో సిట్ ఆఫీస్ కు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఇది వరకే జైలుకెళ్లి వచ్చిన పాశం శ్రీను అక్రమంగా రిజస్ట్రేషన్ చేసేందుకు తాజాగా యత్నిచడంతో పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎల్బీనగర్ సిపి క్యాంప్ కార్యాలయంలో సిపి మహేష్ భగవత్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. భువనగిరిలోని సర్వే నెంబర్ 730లో గల 5 ఎకరాల భూమి తుమ్మ శ్రీనివాస్ అనే నయీమ్ బినామీ పేరు మీద ఉంది. అట్టి స్థలాన్ని డివిఆర్ ఎస్టేట్ అధినేత ఎం.వెంకటేశ్వర్రావు పేరు మీదకు జిపిఎ చేశారు. ఈ స్థలం ఒరిజనల్ డాక్యుమెంట్లు ఎవ్వరి వద్ద లేవు , జిరాక్సు పేపర్లు మాత్రం నయీమ్ అనుచరుల వద్ద ఉన్నాయి.
దీనితో మోక్ష కన్స్ట్రకన్స్ మేనేజింగ్ డైరక్టర్ గోపి మన్నెంతో రూ.5 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గోపి మన్నేం దగ్గర 90 లక్షలు రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్నారు. ఒరిజనల్ దస్తావేజులు లేకుండా రిజస్ట్రేషన్ చేయడానికి సబ్‌రిజిస్ట్రార్‌తో భారి ఒప్పందం కుదుర్చుకున్నారు. బినామీ భూమి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు సమాచారం అందుకొని, నిఘా పెట్టి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.88 లక్షలు నగదు , మూడు కార్లు, పలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్ ఆస్తులను కొనుగోలు చేయడం కానీ, అమ్మడానికి కానీ ఎవ్వరూ ప్రయత్నించవద్దని సిపి మహేష్ భగవత్ హెచ్చరించారు.
దీనిలో భాగంగానే పోలీసులు అక్రమార్కులకు కొమ్ముకాస్తే ఉపేక్షించేది లేదని చెప్పడానికే భువనగిరి డీసీపీ ని, భువనగిరి పట్టణ సీఐ, సిట్ అధికారిగా వ్యవహరిస్తున్న సిఐ లను బదిలీ చేసి సి పి రాచకొండ ఆఫీస్ కు అటాచ్ చేశారు. మొత్తానికి నయీం చచ్చి మూడేళ్లు గడుస్తున్నా… భువనగిరి ప్రాంత వాసులు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నారు. పూటకొకడు నయీమ్ పేరు చెప్పి ఇంకా దందాలు చేస్తూనే ఉన్నారు.