ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ఏ క్షణానైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. డేటా చోరీ ఏపిసోడ్ కేంద్రంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం, నేతల జంపింగ్ జపాంగ్‌ల పర్వంతో ఏపీలో ఎన్నికల వేడి మొదలైపోయింది.
అభ్యర్ధుల ఎంపికపై పార్టీలన్ని కసరత్తును మమ్మరం చేసిన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మలుపులు మీద మలుపులు తిరుగుతున్నాయి. సీటును దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలు వరుస పెట్టి కండువాలు మార్చేస్తున్నారు. టీడీపీలో సీటు దక్కని నేతలు వైసీపీలో చేరుతుండగా.. వైసీపీతో పాటు మొన్నటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న కొంతమంది సీనియర్ నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన టీడీపీలో చేరనున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. గత కొంతకాలంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో లగడపాటి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. సీఎంతో తరచూ భేటీ అవుతుండటంతో పాటు టీడీపీకి అనుకూలంగా ఆయన వ్యవహారిస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో కలిసి చంద్రబాబు నివాసానికి లగడపాటి వెళ్లడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
అయితే లగడపాటి టీడీపీలో చేరతారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నవే. కానీ ఆ వార్తలపై పలుమార్లు స్పందించిన ఆయన.. తాను ఏపీలో మళ్లీ పోటీ చేయనని, అవకాశం వస్తే తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్ర విభజనతో రాజకీయ సన్యాసం పుచ్చుకున్న తనకు మళ్లి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఆశ ఉందని అనేక సార్లు లగడపాటి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో లగడపాటి పొలిటికల్ రీఎంట్రీపై మరోసారి మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆయన టీడీపీలో చేరడం ఖాయమని, గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం మీడియాలో జోరుగా జరుగుతోంది.
కాగా, ప్రస్తుతం నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీగా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఉన్నారు. ఆయనను పక్కన పెట్టి లగడపాటికి చంద్రబాబు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే రాయపాటి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నేతగా పేరున్న రాయపాటిని తప్పించే ప్రయత్నం చేస్తే గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పవచ్చు.
ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి కేటాయించనందుకు చంద్రబాబుపై, రాయపాటి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోతే రాయపాటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నికలకు ముందు పల్నాడు రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.