రాహుల్ సభకు రేవంత్ రెడ్డి డుమ్మా

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నగారా మోగించారు ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ. ఆయన శనివారం హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగిన సభలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం చేయడం కోసమే రాహుల్ సభ ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి గైర్హాజరయ్యారు. అతి సమీపంలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న సమయంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ వచ్చిన సభలో రేవంత్ రెడ్డి పాల్గొనకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదబ్బా అని పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ రాహుల్ సభకు ఉద్దేశపూర్వకంగానే రాలేదన్న గుసగుసలు వినబడుతున్నాయి.

మొన్నటి ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దిక్కు దివానం లేకుండా ఓటమిపాలైంది. 19 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హేమాహేమీలు సైతం గులాబీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు, కాకలు తిరిగిన యోధులు సైతం నిలబడలేక అడ్రస్ గల్లంతైంది. 19 మంది ఎమ్మెల్యేలతోపాటు కూటమి పార్టీ అయిన టిడిపి మరో రెండు సీట్లలో నెగ్గింది. అయితే టిడిపిలో ఉన్న సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే కారెక్కుతానని ప్రకటించారు. కాంగ్రెస్ లో ఇప్పటి వరకు మూడు వికెట్లు డౌన్ అయ్యాయి. ఆత్రం సక్కు, రేగా కాంతారావు తాము టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రకటన చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీద టిఆర్ఎస్ ఆకర్ష్ వల విసిరింది. ఆయన సైతం కారెక్కనున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అటూ ఇటూగా రేపు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయని కాంగ్రెస్ వర్గాలు భయపడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు శంషాబాద్ లో సభ పెడితే కీలక నేతలు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
ఆ ఇద్దరిపై రేవంత్ గుస్సా ?
రేవంత్ రెడ్డి రాహుల్ సభకు రాకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నేతల వైఖరి వల్లే రేవంత్ ఈ సభకు దూరంగా ఉన్నట్లు వారు అంటున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు, సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క ల తీరు వల్లే రేవంత్ శనివారం సభకు రాలేదని తెలుస్తోంది. మొన్న జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వీరిద్దరి నాయకత్వంలోనే వెళ్లామని, అయినా ఘోర పరాజయం పాలయ్యామని రేవంత్ వర్గం చెబుతోంది. అదే సమయంలో తిరిగి అదే జంట (ఉత్తమ్, బట్టి)కు మళ్లీ పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు కట్టబెట్టడం పట్ల రేవంత్ గుర్రగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ కు ఏమాత్రం నచ్చడంలేదని అంటున్నారు. మొన్న అసెంబ్లీ ఆవరణలో ‘‘నా ఫోన్ ఎందుకు బ్లాక్ చేశావు’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేటిఆర్ తో మాట్లాడిన తీరు రేవంత్ కు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. గంటన్నరపాటు కేటిఆర్ తో మంతనాలు సాగించాల్సిన అవసరమేముందని రేవంత్ తన సన్నిహితుల వద్ద వాపోయారని చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి టిఆర్ఎస్ తో గట్టి ఫైట్ చేయాల్సిన సమయంలో పిసిసి చీఫ్ గా ఉండి ఇలా వ్యవహరించడమేంటని రేవంత్ వర్గం ప్రశ్న. అంతేకాకుండా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తుంటే వారిని కాపాడుకోలేని నాయకులు పార్టీని ఏమి కాపాడుతారని రేవంత్ శిబిరం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పార్టీ ఎమ్మెల్యేలు దూరం కాకుండా కాపాడే ప్రయత్నమే సిన్సియర్ గా జరగడంలేదని రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొన్నటి ముందస్తు ఎన్నికలు ఎవరి నాయకత్వంలో అయితే వెళ్లామో వారినే మళ్లీ ముందు పెట్టడం విషయంలో అధిష్టానంపైనా రేవంత్ రెడ్డి గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. మళ్లీ వారితోనే ఎన్నికలకు పోతే పెద్దగా పార్టీకి ఒరిగేదేమీ ఉండబోదని రేవంత్ వర్గం చెబుతున్నమాట.
ఇప్పుడు చేసేదేమీ లేదు…
ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేసేదేమీలేదని రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. ఆ ఓటమిని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రాలేకపోతున్నారు. అడపా దడపా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా… గతంలో మాదిరిగా దూకుడుగా లేరు. టచ్ మి నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు మరింత సమయం ఉందని, తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

ఎవరు అవునన్నా కాదన్నా… టిఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గట్టి ప్రత్యర్థి అనడంలో సందేహం లేదు. కేసిఆర్, కేటిఆర్, హరీష్ లాంటి పెద్ద నేతలపై వారితో ధీటుగా విమర్శలు, మాటల తూటాలు పేల్చగల దిట్ట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిలా అంతగా టిఆర్ఎస్ ను ఎదుర్కొనే వారు తక్కువే అని చెప్పాలి. గులాబీ బాస్ లు ఏ భాషలో మాట్లాడితే రేవంత్ కూడా అదే భాషలో సమాధానం చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ముందస్తు ఎన్నికల వరకు కూడా రేవంత్ దూకుడుగా ఉన్నారు. బహిరంగ సభల్లో కేసిఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. కానీ ఎన్నికల తర్వాత కొంత సైలెంట్ అయ్యారు. మరి రేవంత్ ఎప్పుడు ఫీల్డులోకి వస్తారా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ సభకు డుమ్మా కొట్టడమంటే పార్టీలో క్రమశిక్షణ తప్పినట్లుగానే భావిస్తారా? లేదంటే రేవంత్ తో అధిష్టానం పెద్దలు సంప్రదింపులు చేస్తారా అన్నది చూడాలి.

 

ఈ వార్త చదవండి

https://trendingtelugunews.com/rahul-gandhi-comments-at-hyderabad-meeting/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *