పాకిస్తాన్ లోని బాలాకోట్ ఏరియాలో బాంబులు వేసి చెట్లను ధ్వంసం చేశారని పాకిస్తాన్ అటవీ శాఖ భారత వాయుసేన పైలట్ల మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది.
గుర్తుతెలియన పైలట్లని పేర్కొంటూ ఈ ఎఫ్ ఐ ఆర్ నమోదుచేశారు. ఈ గుర్తుతెలియని భారత పైలట్లు పాకిస్తాన్ లో చొరబడిన తర్వాత హడావిడిగా జారుకుంటూ వదిలేసిన బాంబుల వల్ల 19 చెట్లు కూలిపోయాయని పాకిస్తాన్ అటవీ శాఖ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొందని ట్రిబ్యూన్ రాసింది.
ఇది ఎకొటెర్రరిజం అని చెబుతూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదుచేసేందుకు కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది.
భారతీయ వాయుసేన పైలట్లు బాలాకోట్ పట్టణ సమీపంలోని జబ్బాటాప్ అనే పర్వత ప్రాంతఅడవి మీద బాంబులు వేశారని పాక్ పేర్కొంది. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు 40 కి.మీ దూరాన ఉంటుంది.
భారత జెట్ యుద్ధవిమానాలు బాలాకోట్ సమీపంలోని ఫారెస్ట్ రిజర్వు మీద బాంబులు వేశాయని, ఈ దాడి పర్యావరణ ప్రభావాన్ని పాక్ ప్రభుత్వం అంచనా వేస్తున్నదని వాతావరణ మార్పల శాఖ మంత్రి మాలిక్ అమీన్ అస్లామ్ తెలిపారు. ఈ అంచనా ఆదారంగా ఐక్యరాజ్యసమితి తదితర వేదికల మీద ఫిర్యాదు చేస్తారు.
‘అక్కడ జరిగిందేమనుకుంటున్నారు, పర్యావరణ టెర్రరిజం.బాంబుల దెబ్బతో డజన్ల కొద్ది పైన్ వృక్షాలు నెలకొరిగాయి,’ అస్లామ్ చెప్పారు.
ఈ ప్రాంతాన్ని సందర్శించిన రాయిటర్ విలేకరులు అక్కడ బాంబుల పడటంతో ఏర్పడిన నాలుగు గోతులను చూశారని, దానితో పాటే 15 కూలిపోయిన పైన్ చెట్ల ను కూడా గమనించారని పాక్ మంత్రి చెప్పారు. బాంబుల దాడిలో వందలాది మంది మిలిటెంట్లు చనిపోయారన్న వార్తలను గ్రామస్థులు ఖండిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.
మిలటరీ కార్యకలాపాలలో భాగంగా కావాలనే పర్యావరణాన్ని ధ్వంసం చేయడం స్పష్టంగ అంతర్జాతీయ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన 47/37 తీర్మానం చెబుతుందని ఆయన తెలిపారు.