తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్యతో ఇప్పటికే మంత్రి జగదీష్ రెడ్డి చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనతో మాట్లాడేందుకు పలువురు ప్రయత్నించగా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది.
శుక్రవారం మద్యాహ్నం చిరుమర్తి లింగయ్య కేసీఆర్ ను కలవనున్నట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ కు గట్టి షాక్ నిస్తోంది.
చిరుమర్తి లింగయ్య స్వగ్రామం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బి.వెల్లంల. చిరుమర్తి లింగయ్య కోమటి రెడ్డి బ్రదర్స్ అనుచరుడు. చిరుమర్తి లింగయ్యకు రాజకీయ ఓనమాలు నేర్పిందే కోమటి రెడ్డి బ్రదర్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. బ్రాహ్మణ వెల్లంల ఎంపీటిసిగా మరియు నార్కట్ పల్లి జడ్పీటిసిగా చిరుమర్తి లింగయ్య పని చేశారు.
అదే సమయంలో 2009లో నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టి చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించారు. ఆ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. ఆ తర్వాత 2014లో కూడా లింగయ్యకు టికెట్ ఇప్పివ్వగా ఆ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి వేముల వీరేషం గెలుపొందారు.
2019 ఎన్నికల్లో చిరుమర్తి కి టికెట్ ఇవ్వమని హైకమాండ్ లో చర్చ జరిగింది. కానీ కోమటి రెడ్డి బ్రదర్స్ చిరుమర్తికి అండగా నిలబడి చిరుమర్తికి టికెట్ రాకపోతే తాము పోటి చేయమని సవాల్ విసిరి మరీ చిరుమర్తికి టికెట్ ఇప్పించారు. ఈ ఎన్నికల్లో వేముల వీరేషం మీద ఉన్న వ్యతిరేకత లింగయ్యకు కలిసొచ్చింది.
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు పార్టీలకతీతంగా చిరుమర్తి లింగయ్యకు ఓటు వేసి గెలిపించుకున్నారు. అప్పటి నుంచే ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. కానీ రాజకీయ గురువులైన కోమటిరెడ్డి బ్రదర్స్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కానీ అనూహ్యంగా టిఆర్ఎస్ నేతలు చర్చలు జరపడంతో ఆ చర్చలు సఫలమై చిరుమర్తి పార్టీ మార్పుకు కారణమైనట్టు తెలుస్తోంది.
చిరుమర్తి పార్టీ మార్పు పై కోమటిరెడ్డి అనుచరుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి “ట్రెండింగ్ తెలుగు న్యూస్” తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
“చిరుమర్తి లింగయ్యకు రాజకీయ భిక్ష పెట్టిందే కోమటిరెడ్డి బ్రదర్స్ . అటువంటి వారికి ద్రోహం చేసి పార్టీ మారడం బాధాకరం. లింగయ్య వాళ్ల నాన్న వెంకట్ రెడ్డి ఇంట్లో పాలేరు పని చేసేవారు. ఏదైనా ఉపాధి చూపించాలని కోరితే కోమటిరెడ్డి బ్రదర్స్ మానవతా ధృక్పధంతో రాజకీయంలోకి తీసుకొచ్చారు. ముందుగా ఎంపిటిసిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చారు. ఈ రోజు వారిని కాదని నిర్ణయం తీసుకోవడం చిరుమర్తి లింగయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం” అని అన్నారు.
ఇటివల కాంగ్రెెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావులు టిఆర్ఎస్ లో చేరారు. తాజాగా చిరుమర్తి కూడా కారెక్కనుండడంతో కాంగ్రెస్ లో కలవరం మొతలైంది. కోమటిరెడ్డి బ్రదర్సే ప్లాన్ ప్రకారం ముందుగా చిరుమర్తిని పంపి ఆ తర్వాత వారు కూడా కారెక్కుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా తెలంగాణలో మాత్రం పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. చిరుమర్తి దీని పై ఎలా స్పందిస్తారో చూడాలి.