ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి సినీతారల తాకిడి ఎక్కువైంది. జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ తరం అందాలనాటి వైసీపీలో చేరారు. సినీనటి జయసుధ గురువారం తెలుగుదేశం పార్టీని వీడారు. సాయంత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జయసుధ 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వైఎస్సార్ ఆమెకు సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఇచ్చి, ఆమె గెలుపుకు మద్దతుగా నిలబడ్డారు. అయితే 2014 లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆమె పరాజయం పొందారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో ఆమె గులాబీ గూటికి చేరొచ్చు అని భావించారంతా. కానీ అనూహ్యంగా 2016 లో విజయవాడలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు జయసుధ.
టీడీపీలో చేరినప్పటి నుండి ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. కాగా ఆమె గురువారం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రోద్బలంతోనే హైదరాబాద్ లో ఆస్తులున్న నేతలు వరుసపెట్టి వైసీపీలో చేరుతున్నారని, ఇక సినీ తారలు కూడా అందుకే జగన్ కి మద్దతు ఇస్తున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దీనికి బ్రేకులు వేశారు జయసుధ. జగన్ తో భేటీ అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా టీఆరెస్ వత్తిడి వల్ల వైసీపీలో చేరలేదని స్పష్టం చేసిన ఆమె హైదరాబాద్ లో తనకు సినిమా తప్ప వేరే వ్యాపారాలేవి లేవని పేర్కొన్నారు. టీడీపీలో చేరానే కానీ పార్టీలో తన బాధ్యతలేమిటో, ఏం చేయాలో ఎవరూ చెప్పలేదని వాపోయారు. తన రాజకీయ ప్రవేశం దివంగత వైఎస్సార్ ప్రోత్సాహంతోనే జరిగిందని, ఇప్పుడు వైసీపీలో చేరడంతో సొంత గూటికి చేరినట్టు ఉందని సంతోషం వ్యక్తం చేసారు.
అయితే ఆమె వైసీపీలో చేరుతారన్నప్పటి నుండి రాజమండ్రిలో ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయను అంటున్న మురళీమోహన్ ఒకవేళ రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తే ఆయనకు పోటీగా జయసుధ నిలబడే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి.
కానీ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే కీలక విషయాన్ని తెలిపారు. జగన్ ఆదేశిస్తే 2024 లో పోటీ చేస్తానని అన్నారు. ఇప్పుడు మాత్రం పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. ఈ ఎన్నికల తర్వాత జగన్ సీఎం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు జయసుధ.