ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది.
ఠాకూర్ నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేపట్టారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదనపు నిర్మాణాలను తొలగించాల్సిందిగా జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ అదనంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసింది జిహెచ్ఎంసి. కాగా హైకోర్టు తీర్పుపై ఆళ్ళ స్పందించారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
ఏపీ డీజీపీ ఇంటినిర్మాణంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. సీఎం వెనక ఉన్నారని డీజీపీ అక్రమాలకు పాల్పడుతున్నారు. డీజీపీయే చట్టాలు ఉల్లంఘింస్తుంటే ఎవరి వద్దకు వెళ్లాలి?
డీజీపీ ఠాకూర్ ప్రశసాన్ నగర్లో భారీగా ఖర్చుతో ఇంటి నిర్మాణం చేస్తున్నారు. బిపిఆర్ఎస్ కింద 2010లో పెనాల్టీ కట్టి ఒకటో ఫ్లోర్ వరకే పర్మిషన్ తీసుకున్నారు. 2018లో డీజీపీ అక్రమ నిర్మాణాన్ని జిహెచ్ఎంసి గుర్తించి నోటీసులు ఇచ్చింది.
జిహెచ్ఎంసి అధికారులను, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ ను డీజీపీ భయబ్రాంతులకు గురి చేసారు. పిల్లలు ఆడుకునే పార్కును కూడా డీజీపీ ఠాకూర్ కబ్జా చేసారు.
డీజీపీ పార్క్ కబ్జాపై జిహెచ్ఎంసి అధికారులు వెళ్తే పోలీసులను పెట్టి బెదిరించారు. డీజీపీ ఠాకూర్ ఏసీబీ అడిషనల్ డీజీగా రెండు పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారు..?
ఏపీ డీజీపీ ఠాకూర్ కాదు ‘డాకూర్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.