ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికి గురై చనిపోయిన వరంగల్ రవళి మృతి చెందింది. ఆమె ప్రవర్తన పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంటు చేస్తున్నారు. దీంతో అమ్మాయి ప్రవర్తన పై పలువురు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్ల పై వారికి జర్నలిస్ట్ సువర్ణ సంకసర్ల పలు ప్రశ్నలు సంధించారు. ఆమె సంధించిన ప్రశ్నలివే…
ప్రేమించి మోసం చేసిందని బలుపెక్కి ఇంకొకడితే తిరిగితే అలాంటి ఆడదాన్ని చంపేయాలి అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తన్న మహానుభావులందరిని నాదొక విన్నపం.
- ఇంత గొంతు చించుకొని అరిచే మీరు ఆ వయసులో ఎవరిని ప్రేమించలేదా?
- ఇలా చంపడమే కరెక్ట్ అన్న పెద్దలారా రేపు ఆ లిస్టులో మన కూతురు మన అక్కనో చెల్లెనో ఉండొచ్చు అప్పుడు కూడా చంపడమే కరెక్ట్ అంటారా?
- ఎవరో తెలియని అనామకురాలు అని ఆ అమ్మాయి ఫోటోస్ ని హల్చల్ చేస్తున్నారు అదే మీ ఇంట్లో అమ్మాయి అయితే ఇలానే చేసేవారా?
- బరితెగించి తిరిగింది అన్నారు రవళిని. అది ఫోటోస్ బయటికి వచ్చే సరికి. మరి ఫోటోస్ బయటికి రాకుండా మనవాళ్లే తిరుగుతున్నారేమో ముందు మీ ఇంట్లో వాళ్లని చూసుకున్నారా?
- పెద్దలు అటెడు తరాలు ఇటెడు తరాలు చూసిన పెళ్లిలో అయినా ఎంత మంది మధ్యలో విడిపోవడం లేదు. అలాంటిది ప్రేమించిన వారు నచ్చక విడిపోయి ఎవరి బతుకు వారు బతకడం తప్పా. ?
- ప్రేమించి వదిలేస్తే చంపేయాలి అన్నప్పుడు మన ఇండ్లలో ఎంత మంది మిగులుతారు.?
మనం సమాజంలో బతుకుతున్నాం. ఒకరిని చూసి ఒకరం మారుతున్నాం. వయస్సులో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే. దీన్ని ఎవరూ మార్చలేరు అని అన్ని తెలిసి కూడా మేం మంచి వాళ్లం అని డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు ఎవడో చేసిన పనికి కూతురు లేకుండా పోయింది. కూతురు లేక మీరందరు పెట్టే పోస్టులు, మాటలు కాకుల్లా పొడుస్తుంటే వారు ఎంత గుండె కోత అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి.
- మీ సువర్ణ సంకసర్ల