గత కొంత కాలంగా మీడియాలో జోరుగా ప్రచారం అవుతోన్న వార్త నిజం అయింది. టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ వీడతారంటూ చాలా రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు వాస్తవంలోకి వచ్చాయి. మంగళవారం టీడీపీకి రాజీనామా చేసారు మోదుగుల. ఈ మేరకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి. స్పీకర్ కోడెలకు తన రాజీనామా పత్రాన్ని పంపారు.
వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖ ద్వారా తెలిపారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్న ఆయన తన రాజీనామాను ఆమోదించగలరని కోరారు. మోదుగుల గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉంటున్నారు. దీనికి కారణం మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకపోవడమే అని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కొంత అసంతృప్తికి లోనైనప్పటికీ గుంటూరు పశ్చిమపై అధిష్టానం ఆయనకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇవ్వడంతో కొద్దిరోజులు సర్దుమణిగారు.
కానీ మంత్రిత్వం దక్కలేదన్న నిరాశ మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు మోదుగుల ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా అనుచరులు మండేదాంట్లో ఆజ్యం పోస్తుండేవారు. పైగా గుంటూరు పశ్చిమ రాజకీయాల్లో ఆయన ఇమడలేకపోయారు అనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్. ఇక పార్టీపై అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరడంతో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మంగళవారం ఉదయం సన్నిహితులు, అనుచరగణంతో భేటీ అయిన ఆయన చర్చల అనంతరం టీడీపీని వీడటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఈరోజే ఆయన జగన్ తో భేటీ అవనున్నట్టు ముఖ్యనేతల సమాచారం. జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని రాగానే కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మోదుగుల గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ముందుగానే వైసీపీ కీలక నేతలకి తెలిపినట్టు సమాచారం. మోదుగుల గుంటూరు నుండి కాకుండా నరసరావుపేట నుండి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.
మోదుగులకు జిల్లాలో మాస్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ఆయన తీరు కూడా మాస్ గానే ఉంటుంది అంటుంటారు దగ్గరగా చూసినవారు. గుంటూరు పశ్చిమ రాజకీయాల్లో ఆయన ఇమడలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెబుతున్నారు. మాస్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని ఆయనకి టికెట్ ఇస్తే తప్పక గెలుస్తారు అంటున్నారు. అంతేకాదు టీడీపీ కంచుకోటగా ఉన్న జిల్లాలో మరో రెండు మూడు అసెంబ్లీ స్థానాలపై ఆయన ప్రభావం బలంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే నరసరావుపేటలో పార్లమెంటు సమన్వయకర్తగా లావు కృష్ణదేవరాయలు టికెట్ రేస్ లో ఉన్నారు. ఎవరు రేస్ లో ఉన్నా గెలుపు ముఖ్యం కాబట్టి జగన్ కూడా మోదుగులకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.