కర్నూల్ జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ ముఖ్యనేతలు వరుసపెట్టి వైసీపీలో చేరడంతో టీడీపీలో వర్గాల్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కర్నూల్ జిల్లా బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత టీడీపీకి రాజీనామా చేయడంతో పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. దీనికి సంబంధించిన వివరాలు కింద చదవండి.
బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలానికి చెందిన కోవెలకుంట్ల మాజీ శాసన సభ్యులు చల్లా రామకృష్ణారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవికి, టీడీపీ పార్టీ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎంకు తన రాజీనామా పత్రాన్ని పంపించారు చల్లా. త్వరలోనే ఆయన వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో బనగానపల్లి వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.
అయితే ఆయన టీడీపీకి రాజీనామా చేయడం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న కారణం చంద్రబాబు చల్లాకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడమే అంటున్నారు సన్నిహితులు. 2014 ఎన్నికల్లో బిసి జనార్దన్ రెడ్డి గెలుపుకు అన్ని విధాలా సహకరించిన చల్లా రామకృష్ణారెడ్డికి శాసన మండలి పదవిని ఇస్తాము అని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అటు చంద్ర బాబు, ఇటు బిసి జనార్దన్ రెడ్డి లు ఆయనకి సముచిత స్థానాన్ని కల్పించడంలో విఫలం అయ్యారంటున్నారు.
అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు రెండు సార్లు పర్యటించినప్పుడు, నారా లోకేష్ అవుకు పట్టణం చల్లా రామకృష్ణారెడ్డి ఇంటి మీదుగా పర్యటన చేస్తున్న సమయంలో ఆయనని మర్యాద పూర్వకంగా పిలవడం కూడా చేయకపోవడం తో చల్లా వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఒకానొక దశలో వైసీపీలో చేరడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో నియోజకవర్గంలో తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని బిసి జనార్దన్ రెడ్డి చల్లాకు శాసన మండలి పదవి కల్పించాలని హైడ్రామా ఆడారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనుచరులు.
ఇటీవలి కాలంలో బిసి జనార్దన్ రెడ్డికి, చల్లా రామకృష్ణారెడ్డికి విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఆయనను బుజ్జగించడానికి చంద్రబాబు కడప రీజియన్ ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇచ్చినప్పటికీ దానిని సున్నితంగా చల్లా రామకృష్ణారెడ్డి తిరస్కరించారు. ఆ తరువాత రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకుల కోసం కొన్ని నెలల కాలం పదవిని చేపట్టారు.
అయినప్పటికీ బిసి జనార్దన్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డిని కలుపుకు పోవడంలో విఫలం అయ్యారంటున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా చల్లాను విస్మరించడంతో చల్లా వర్గీయుల్లో తీవ్ర అసహనం నెలకొంది అంటున్నారు చల్లా వర్గీయులు. ఇక ఇదే సమయంలో చల్లాను వైసీపీలోకి తెచ్చేందుకు స్థానిక వైసీపీ నేతలు పావులు కదిపారు. గత ఎన్నికల్లో బనగానపల్లిలో టీడీపీ గెలుపుకు కీలక పాత్ర వహించిన కీలక నేత వైసీపీలో ఉంటె పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావించింది వైసీపీ అధిష్టానం. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మీకు సముచిత స్థానం తప్పక కల్పిస్తాము అని హై కమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాగా వైసీపీలో చేరేముందు టీడీపీకి, పదవులకు రాజీనామా చేయాలనీ జగన్ సూచించడంతో ఆయన ఈరోజు టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారవనుంది. ఇక చల్లా రామకృష్ణారెడ్డి పార్టీలో చేరనుండటంతో బనగానపల్లి వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.