తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా పలు పార్టీల కీలక నేతలను ఇతర పార్టీల వారు సంప్రదిస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా నాయకుడు, టిడిపి సీనియర్ నేత నామా నాగేశ్వరరావును కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ నేతలు సంప్రదించినట్టు నామా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరాలనే దాని పై నామా ఆలోచిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
నామా నాగేశ్వరరావు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఆయన 2004 లో ఖమ్మం నుంచి టిడిపి ఎంపీగా పోటి చేసి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. లక్ష ఓట్ల మెజార్టీతో నామా పై రేణుక విజయం సాధించారు. తిరిగి 2009 లో పోటి చేయగా 1,25,000 ఓట్ల మెజార్టీతో నామా నాగేశ్వరరావు రేణుకా చౌదరి పై గెలుపొందారు. 2014 లో ఖమ్మం నుంచి వైసిసి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
నాగేశ్వరరావు రాజకీయాలలోకి రాకముందు విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుపొందారు. మధుకాన్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నారు. గ్రానైట్,విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కలవు. 2009లో లోక్ సభకు పోటి చేసిన సమయంలో తన ఆస్తుల విలువ 173 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు లోక్ సభకు పోటి చేసిన వారందరిలో అత్యధిక ధనవంతుడు నామానే.
ప్రస్తుతం నామా నాగేశ్వరావు టిడిపిలోనే కొనసాగుతున్నారు. బలమైన నేతగా, చంద్రబాబుకు సన్నిహితునిగా నామాకు పేరుంది. అయితే నామాకు పార్టీలో చేరాలని టిఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంతటా ఒక తీర్పు వస్తే ఖమ్మంలో మాత్రం విలక్షణమైన తీర్పు వచ్చింది. ప్రజలంతా ఖమ్మంలో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఈ సంధర్భంగా కాంగ్రెస్ లో చేరితే నామా గెలవడం సాధ్యమే.
అయితే కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి బరిలో దిగే అవకాశం ఉండడంతో నామాకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. టిఆర్ఎస్ లో చేరితే అక్కడి నుంచి కూడా ఎంపీగా చాన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత నామా పై ప్రభావం చూసే అవకాశం ఉందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామాను టిఆర్ఎస్ లోె చేరాలని కెోరినట్టు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాలా లేక టిఆర్ఎస్ లో చేరాలా అని నామా పలువురు సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
మరో వైపు నామా వ్యాపారాలన్ని ఆంధ్రాలోనే ఉన్నాయి. కాంగ్రెస్ టిడిపిలు తెలంగాణలో కలిశాయి. ఈ నేపథ్యంలో పార్టీ మారితే వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందేమోనన్న ఇబ్బంది కూడా నామాకు ఎదురవుతుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే చేరడానికి నామా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి నామా నాగేశ్వరరావు పార్టీ మారుతారా లేక టిడిపిలోనే కొనసాగుతారా అనే చర్చ ఖమ్మం రాజకీయాల్లో జోరందుకుంది.