ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ నేతలు యుక్తులు, కుయుక్తులు మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. నెగ్గాలంటే తమ బలంతో పాటు ప్రత్యర్థిని పలువిధాలుగా బలహీనపరిచే పనిలో పడ్డారు నాయకులు. దీనికోసం నానారకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ సిఐ గోరంట్ల మాధవ్ కి మధ్య జరిగిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
గతేడాది సెప్టెంబర్లో తాడిపత్రిలో ప్రభోదానంద ఆశ్రమంలోని భక్తులకు, గ్రామస్థులకు మధ్య జరిగిన వివాదం… జేసీ కి పోలీసులకి మధ్య విభేదాల్ని తెచ్చిపెట్టింది. ఆశ్రమం వద్ద ఆందోళన చేపట్టడానికి వచ్చిన జేసీ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. జేసీ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు మండిపడ్డారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో జిల్లా పోలీసు సంఘం కార్యదర్శి, కదిరి సిఐగా ఉన్న గోరంట్ల మాధవ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఏ రాజకీయ నాయకుడైన నాలుక కోస్తా, ఖబడ్ధార్ అంటూ మీసం మెలేసి జేసీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో గోరంట్ల మాధవ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలో మాధవ్ మీసం మెలేస్తూ వార్నింగ్ ఇచ్చిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మాధవ్ తనను వ్యక్తిగతంగా దూషించారంటూ జేసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మాధవ్ ఎవరినీ వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దీంతో పోలీసులు తన కేసు నమోదు చేసుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు జేసీ. జిల్లా ఎస్పీ దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసారు. మాధవ్ చేసిన వ్యాఖ్యలు పరిశీలించామని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా దూషించలేదని, సొసైటీని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా చేసిన వ్యాఖ్యలే అని వీరి తరపు న్యాయవాది వాదించారు. దీంతో జేసీ ప్రయత్నం విఫలమైంది. మాధవ్ పై కేసు నమోదు కాలేదు.
కాగా కొన్ని నెలల క్రితం తన పదవికి రాజీనామా చేసి మాధవ్ వైసీపీలో చేరారు. జేసీని ఎదిరించిన కారణంగానే ఆయన్ని జగన్ పార్టీలో చేర్చుకున్నారని ప్రచారం సాగింది. అనంతపురంలో జేసీని అడ్డుకోవడానికి మాధవ్ ను రంగంలోకి దించారంటూ వార్తలు వెల్లువెత్తాయి. కాగా త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జేసీ, మాధవ్ ల మధ్య వివాదం మరోసారి తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
నాలుగురోజుల క్రితం హై కోర్టులో ఉన్న కేసును వెనక్కి తెచ్చి తాడిపత్రి కోర్టులో ప్రయివేటు కంప్లైంట్ చేసారు జేసీ. కోర్టు ఆదేశాల అనుసారం తాడిపత్రి పోలీసు స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద మాధవ్ పై కేసు నమోదు చేసినట్టు సమాచారం. మాధవ్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు జేసీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రోజురోజుకి ప్రజల్లో గోరంట్ల మాధవ్ పై పెరుగుతున్న క్రేజ్ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు మాధవ్ సన్నిహితులు.