జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్తో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తమకు ఉన్న సమాచారం మేరకు మసూద్ అజర్ పాక్‌లోనే ఉన్నాడని, అతని ఆరోగ్యం సరిగా లేదని, కనీసం ఇల్లు దాటి బయటకు కూడా వెళ్లలేడని మంత్రి ఖురేషి చెప్పారు. మసూద్ అజర్ వివరాలు తమకేమి తెలియనట్టు వ్యవహరిస్తున్న పాక్, ఈ ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మసూద్ అజర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నకు బదులిస్తూ… అతన్ని అరెస్టు చేసేందుకు కావాల్సిన ఆధారాలు తమ దగ్గర లేవన్నారు. మసూద్‌ను చట్టం ముందు దోషిగా కోర్టులో నిలబెట్టేందుకు ఆధారాలు కావాలన్నారు. భారత్ అటువంటి ఆధారాలను సమర్పించాలన్నారు. గత నెల 14వ తేదీన పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామే అని జైషే సంస్థ ప్రకటించింది. మూడు రోజుల క్రితం పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న తమ స్థావరాలపై భారత్ దాడి చేసింది నిజమే అని కూడా మసూద్ అంగీకరించాడు.