పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పైకి అభినందన్ ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని, పాక్ శాంతిని కోరుకుంటుందని మాట్లాడటం సగటు భారతీయుడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే భారత్ తో చర్చలకు సిద్ధమంటూ, యుద్ధం వస్తే ఆపడం మోడీ చేతుల్లోనే, నా చేతుల్లోనే ఉండదని సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలని శాంతి వచనాలు వల్లించారు.
ఇమ్రాన్ ఖాన్ శాంతికబుర్లను అంత సీరియస్ గా తీసుకోలేదు మన అధికారులు. అభినందన్ ను అప్పగిస్తూ పాక్ మరేదైనా కుట్రకు పాల్పడే అవకాశం లేకపోలేదని మొదటినుండి అనుమానిస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాక్ ఆర్మీ వారి ప్రధాని చెప్పినట్టు నడుచుకునే దాఖలాలు లేవు. అనుకున్నట్టే పాక్ ఆర్మీ తన వక్రబుద్ధిని చాటుకుంది. వాఘా సరిహద్దులో అభినందన్ ను అప్పగిస్తూ ఎల్ఓసి సమీపంలో కాల్పులకు తెగబడింది.
బాలాకోట్, పూంఛ్ సెక్టార్ మెండార్, కృష్ణ ఘాట్లలో మోర్టార్లతో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు అసువులు బాసినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, మరో ఇద్దరు పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఎయిర్ స్ట్రైక్స్ జరిపినప్పటి నుండి పాక్ ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడొచ్చని గ్రహించిన భారత్ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. అలెర్ట్ గా ఉన్న మన సైన్యం పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొడుతోంది.