పాక్ సైన్యం అధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ ను శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ ను రేపు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పాక్ పార్లమెంటులో ఇమ్రాన్ అధికారిక ప్రకటన చేశారు.
ఇమ్రాన్ ఖాన్ పాక్ పార్లమెంటులో ఏం మాట్లాడారంటే…
“ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకునే క్రమంలో భారత్ ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నిన్న తాను ప్రయత్నించాను. కానీ కుదరలేదు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను… తాము భయపడుతున్నట్టుగా అర్థం చేసుకోవద్దు. మా అదుపులో ఇండియన్ పైలెట్ ఉన్నాడు. అతనిని స్నేహ పూర్వకంగా విడుదల చేస్తాం. శుక్రవారం ఇండియన్ పైలెట్ ను విడుదల చేస్తాం.” అని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. మరోవైపు ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయం పట్ల భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.