తెలంగాణ జనసమితికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చిన పార్టీ కి ఉద్యమ నేతలంతా దూరమవుతున్నారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలే దీనికి కారణంగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణ జన సమితికి గురిజాల రవీందర్ రాజీనామా చేశారు. రవీందర్ ప్రస్తుతం కోర్ కమిటి మెంబర్ గా మరియు మంచిర్యాల జిల్లా ఇంఛార్జ్ గా పని చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుల్లో రవీందర్ ఒకరు.
గురజాల రవీందర్ రాజీనామాతో పార్టీలో కలవరం రేగింది. రోజు రోజుకు ముందుకు పోవాల్సిన పార్టీలో ఉన్న నేతలే పార్టీని విడిచి పోవడం చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా టిజెఎస్ లో విబేధాలు ముదురుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగా పోవాలని భావించిన టిజెఎస్ మహాకూటమితో కలిసి చతికిలపడిపోయింది. ఒంటరిగా పోటి చేస్తే కనీసం 4 సీట్లు అయినా గెలిచేవాళ్లం అన్న భావనను కొంత మంది నేతలు వ్యక్తపరిచారు. కాంగ్రెస్ తో పొత్తు ద్వారా ప్రజలలోకి వెళ్లలేకపోయామన్న భావనలో మరికొందరు నేతలున్నారు. ఈ విబేధాల కారణంగానే గతంలో పిట్టల రవీందర్, తిరునగరి జ్యోత్స్న, రచనారెడ్డి లాంటి కీలక నేతలు పార్టీ నుంచి దూరమయ్యారు.
రచనారెడ్డి ప్రముఖ న్యాయవాది మరియు ఉద్యమ నేత. టిజెఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనుల పై కోర్టులలో కేసులు వేసి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో రచనారెడ్డి చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపో్రు. రచనారెడ్డి పేరును సీఎం కేసీఆర్ పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. రచనారెడ్డి అనే లాయరే ప్రాజెక్టులక అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. అంతటి శక్తి ఉన్న మహిళా నేత రచనారెడ్డి. రచనారెడ్డి పార్టీకి రాజీనామా చేసినప్పుడు అంతా ఖంగుతిన్నారు.
తిరునగరి జ్యోత్స్న టిజెఎస్ మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. టిజెఎస్ లోకి రాకముందు జ్యోత్స్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాచిగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేశారు. మెప్మా ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించి టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. తమ వేతనాలు పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని మెప్మా ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగి సర్కార్ కు చుక్కలు చూపించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విశ్రమించేది లేదని వారు పోరు బాట పట్టారు. వారందరికి ఫుల్ సపోర్టేడ్ గా జన సమితి నుంచి జ్యోత్స్న పనిచేశారు. జ్యోత్స్న సడెన్ గా రాజీనామా చేయడంతో అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
సామాజిక న్యాయం, ప్రత్యామ్నాయ రాజకీయాలు అనే లక్ష్యాలకు పూర్తి భిన్నంగా పార్టీ నడుపుతున్నారని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా కలిసి నడిచినా ఈ విధంగా ముగింపు పలకాల్సి వస్తుందని అనుకోలేదని రవీందర్ లేఖలో పేర్కొన్నారు. పార్టీకి ఒక్కొక్కరుగా దూరమవుతుంటే పార్టీ అధినేత కోదండరాం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
రవీందర్ రాసిన లేఖ కింద ఉంది చదవండి.