ఎట్టకేలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. టీడీపీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తున్న డిమాండ్‌కు కేంద్రం తలొగ్గింది అంటున్నాయి టీడీపీ వర్గాలు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు అని మోడీపై రాష్ట్రంలో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణలు.
అనేకసార్లు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లి విభజన హామీలు నెరవేర్చాలని మోదీని కోరాము. అయినా మోదీ కనుకరించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకొచ్చిన టీడీపీ ప్రభుత్వం… కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసింది అని పలు సందర్భాల్లో తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన హామీలను నెరవేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతి జిల్లాలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ధర్మాపోరాట దీక్షలు చేపట్టారు.
ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం పోరాటం దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఎప్పటి నుంచో ఏపీ ప్రజలకు కలగా మారిన విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తూ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సౌత్ కోస్ట్ రైల్వేగా విశాఖ రైల్వే జోన్‌కు నామకరణం చేశారు. మరికొద్ది రోజుల్లో విశాఖలో నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో… రైల్వే జోన్ ప్రకటన రావడం గమనార్హం.
కాగా కొద్ది రోజుల క్రితం రైల్వే జోన్ ప్రకటించాలని కోరుతూ పీయూష్ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అంతకుముందు ఢిల్లీ వేదికగా విభజన హామీలన్ని నెరవేర్చాలంటూ సీఎం చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేలా చేసింది. వచ్చే నెలలో విజయవాడ వేదికగా భారీ ఎత్తున ధర్మపోరాట దీక్షను జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు… వివిధ జాతీయ పార్టీల నేతలను ఆహ్వానించారు.
విభజన హామీలపై టీడీపీ మరింత ఉధృతంగా పోరాటం చేస్తున్న క్రమంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో మెట్టు దిగి వస్తోంది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించడంపై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఆనంద వాతావరణం నెలకొంది.