పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, జగిత్యాల ఆర్మూరు రైతులు అసెంబ్లీ కి పాదయాత్ర చేపట్టారు. దీంతో పాదయాత్ర చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 200 మందిని అరెస్ట్ చేసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పటికీ మూడు సార్లు ఆందోళనకు దిగినా సర్కారు నుంచి స్పందన లేదని భావించిన రైతులు ఇక అసెంబ్లీ వైపు అడుగేస్తేనే అనుకున్న ధర సాధిస్తామని నిర్ణయించుకున్నారు. మంగళవారం గ్రామానికి వంద మంది చొప్పున అసెంబ్లీ వరకు జాతీయ రహదారి వెంట పాదయాత్రగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
వారి పిలుపు మేరకు పార్టీలకతీతంగా… ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల రైతులు మంగళవారం ఉదయం మామిడిపల్లి చౌరస్తా కు చేరుకుని పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర ప్రారంభమై కిలోమీటర్ దాటే లోపు పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఆర్మూరులో రైతులు భారీ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు క్వింటాలు పంటకు రూ.15 వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు వేడుకున్నా తమను పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని హామినిచ్చినా దాని ఊసు లేదన్నారు. సీఎం కేసీఆర్ తమ ఆందోళన పై అసెంబ్లీలో స్పందిస్తారని అనుకుంటే కనీసం తమ ఊసు కూడా ఎత్తలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరో రైతు సోమవారం కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా అక్కడే ఉన్న మరికొందరు రైతులు అతనిని కాపాడారు. రైతులంతా పాదయాత్రగా వెళితే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించిన పోలీసులు హఠాత్తుగా రైతులను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. రైతులంతా పాదయాత్రగా వెళ్లి అసెంబ్లీ దగ్గర తమ నిరసన తెలిపి సీఎం కేసీఆర్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. రైతుల అరెస్టుల పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైతుల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.