ప్రముఖ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 27 న తాడేపల్లిలో నిర్మించిన గృహప్రవేశం చేయనున్నారు జగన్. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుపుతున్నారు వైసీపీ నేతలు.
అయితే ఇదే రోజున తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు హితేష్ చెంచురామ్ పర్చూరు నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పాలిటిక్స్ అంటే గ్లామర్ కాదన్న ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
నా తోడల్లుడు వింతజాతికి చెందిన వ్యక్తి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆయనది పూటకి ఒక మాట్లాడే స్వభావం అంటూ మండిపడ్డారు. ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. రాజధాని డిజైన్స్ సెలెక్ట్ చేయడానికి నాలుగేళ్లు కావాలా? అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చుపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఏపీ ప్రతిపక్షనేత జగన్ బాటలోనే దగ్గుబాటి కూడా ఆంధ్రా పోలీసు వ్యవస్థని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ ఐజి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను టీడీపీ పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని విమర్శించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.
ఇక దగ్గుబాటి హితేష్ మాట్లాడుతూ తాతగారు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలబాటలోనే తన తల్లిదండ్రులు నడిచారని, నేను కూడా కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా కృషి చేస్తానని అన్నారు. జగన్ తో కలిసి నడవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని చూసే వైసీపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు హితేష్.