భరోసా యాత్ర పేరుతో ఏపీలో ఎన్నికల యాత్రను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రారంభించింది. యాత్రలో భాగంగా తిరుపతిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ మాట్లాడారు.
విభజన తర్వాత తీవ్రంగా గాయపడిన ప్రాంతం రాయలసీమ. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో కూడా అమరావతి ప్రాంత అభివృద్ధి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
అదే రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రస్తావించిన కడప ఉక్కు , మన్నవరం , రాయలసీమ ప్యాకేజి లాంటి విషయాలు పరిశీలన అని చెప్పడం ద్వారా బిజెపి అమలు చేయకుండా తప్పించుకున్నది.
చివరకు రాయలసీమ నీటి ప్రాజెక్టులకు నికరజలాల పంపిణీ కూడా ఆస్పష్టంగా ఉన్నది. కోస్తా ప్రాంతానికి ఉపయోగపడే పోలవరంను చట్టంలో పేర్కొన్నారు. కానీ రాయలసీమకు ఉపయోగపడే దుమ్ముగూడెం టెయిల్ పాండును పట్టించుకోకుండా అన్యాయం చేసారు.
2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఏపీ ప్రజలకు భరోసా కల్పించడానికి తిరుపతికి వచ్చిన రాహుల్ గాంధీ ఏపీలో రాయలసీమ కూడా భాగమే అన్న విషయం కూడా గుర్తుకు రాలేదేమో అన్నట్లుగా వారి ఉపన్యాసం సాగింది.
రాయలసీమ ప్రాంతంలో జరిగిన సమావేశంలో కడప ఉక్కు , రాయలసీమ ప్యాకేజి అమలుకు హామీ ఇస్తారని భావించిన రాయలసీమ ప్రజలకు రాహుల్ నుంచి భరోసా లభించలేదు.
విచిత్రమైన విషయం ఏమిటంటే తిరుపతికి అతి దగ్గరలో కాంగ్రెస్ ప్రభుత్వ మానస పుత్రిక మన్నవరం గురించి ఏమాత్రం ప్రస్తావించకపోవడం. సమావేశంలో మాట్లాడిన ఓ మహిళా నేత హోదా వస్తే కడప ఉక్కు వస్తుంది అని అర్థం వచ్చేలా మాట్లాడారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ప్రాంతీయ పార్టీలు రాయలసీమ అభివృద్ధి విషయంలో పట్టించుకోవడం లేదని, కనీసం జాతీయ పార్టీలయినా పట్టించు కోకపోతాయా అన్న చిన్న ఆశను అవకాశం ఉండి అధికారంలో ఉన్న బీజేపీ అన్యాయం చేసింది.
కనీసం చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీ అయినా తాము చేసిన చట్టాన్ని అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇస్తారని అనుకుంటే వారుకూడా చట్టంలో లేని హోదా అమలుకు హామీ ఇచ్చినారు గానీ రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడే , చట్టంలో ఉన్న అమలుగాని అంశాల గురించి హామీ ఇవ్వకపోవడం చూస్తుంటే ఉట్టికి స్వర్గానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ధ్యాస కూడా ముక్క మీద కన్నా రొట్టెమిదే ఉందని పిస్తుంది. అంటే అదే… రాయలసీమ మీద కాకుండా మధ్య కోస్తాఆంధ్ర పైనే…….
-పురుషోత్తమ రెడ్డి
రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త