తెలంగాణలో తొలి మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. పది మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు సిఎం కేసిఆర్. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ 12 మందితో కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ముందుగా వెలువడిన ఊహాగానాలు నిజం చేస్తూ టిఆర్ఎస్ కీలక నేత, పార్టీ ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు కు తొలి కేబినెట్ విస్తరణలో మొండిచేయి చూపారు కేసిఆర్. ఆయనతోపాటు తనయుడు కేటిఆర్ కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. అయితే కేటిఆర్ కు పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ హోదా ఇస్తూ కీలకమైన బాధ్యతలు కట్టబెట్టారు గులాబీ బాస్.
అయితే కేబినెట్ లో తనకు బెర్త్ దక్కకపోవడంపై హరీష్ రావు అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ జరిగిన వెంటనే మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు రెండు ముక్కలు మాట్లాడారు. అంతకంటే ముందు ఆయన కేబినెట్ మంత్రులుగా ఎంపికైన వారిని అభినందించారు. మంత్రివర్గంలో తాను లేనన్న భావన కానీ, బాధ కానీ బయటకు కనిపించనీయకుండా రాజ్ భవన్ లో హరీష్ రావు సందడి చేశారు. ఆ సమయంలో ఆయన రాజ్ భవన్ లో కేటిఆర్ పక్కనే కూర్చుని తనలో ఏమాత్రం అసంతృప్తి లేదని చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో హరీష్ ఏమన్నారంటే…
కేసిఆర్ తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చి రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చారు. నేను ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పాను. టిఆర్ఎస్ పార్టీలో నేను క్రమశిక్షణ కలిగిన సైనికుడిని. పార్టీ అధినేత కేసిఆర్ ఏ బాధ్యత అప్పగిస్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను నెరవేరుస్తాను. కేసిఆర్ ఏది ఆదేశిస్తే తూ.చా. తప్పకుండా అమలు చేస్తానని పదులసార్లు చెప్పాను. నాకు అసంతృప్తి ఏమీ ఉండదు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రచారం చేస్తే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందరూ కేసిఆర్ నాయకత్వంలో పనిచేయాలని కోరుతున్నాను. సామాజిక సమీకరణాలు, జిల్లాల సమీకరణాలు చూసుకుని సిఎం కేసిఆర్ కేబినెట్ విస్తరణ చేశారని అనుకుంటున్నాను.
నా పేరు మీద ఎటువంటి గ్రూపులు, యువ సేనలు లేవు. ఎవరైనా అలాంటి గ్రూపులు పెట్టుకుంటే కూడా ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని కోరుతున్నాను. నాకు అసంతృప్తి ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుస్ప్రచారాన్ని ఖండిస్తున్నాను. కొత్తగా ఎంపికైన మంత్రులు తెలంగాణకు, టిఆర్ఎస్ కు మంచిపేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.
నిరంతరం ప్రజల కోసం కృషి చేసే ముఖ్యమంత్రి కేసిఆర్. ప్రజల ఆకాంక్షలను వారు నెరవేరుస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఈ రెండు మాటలు మాట్లాడి హరీష్ రావు రాజ్ భవన్ నుంచి నిస్క్రమించారు. మీడియా వారు మరిన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.