ప్రగతి భవన్: కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు తెలంగాణ వ్యవసాయానికి శతాబ్దాల తరబడి ముఖ్య నీటి వనరుగా ఉన్నాయని, మిషన్ కాకతీయతో మళ్లీ చెరువులకు పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరే విధంగా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలన్నారు. చెరువులన్నీ నిండి కలకల లాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లని సీఎం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో మిషన్ కాకతీయ – చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సి మురళీధర్ రావు, కాడా కమిషన్ మల్సూర్, సిఇ శ్యాం సుందర్, కాడా డిడి స్నేహ, రిటైర్డ్ ఇఎన్సీ విజయ్ ప్రకాశ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు.
ఒకప్పుడు తెలంగాణలో చిన్ననీటి వనరుల వ్యవస్థ ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు అద్భుతంగా పండేవి. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరందేది. చెరువులకు నీళ్లు పారేందుకు సహజసిద్ధమైన కాలువలు ఉండేవి. జాలువారు నీళ్లతో చెరువులు నిండేది. 1974లోనే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టిఎంసిల నీళ్ల కేటాయింపు ఉంది. రాను రాను చెరువులు నాశనం అయ్యాయి. తెలంగాణ బతుకు నాశనం అయింది. పంటలకు నీరివ్వడానికి తెలంగాణ రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకున్నారు. అయినా పంటలు సరిగా పండలేదు. వ్యవసాయం దెబ్బతిన్నది’’ అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకున్నాం. చెరువులను బాగు చేసుకున్నాం. ఆ చెరువులు నీటితో కళకళలాడితేనే మిషన్ కాకతీయకు సార్థకత. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లతో చెరువులు నింపాలి. వర్షం నీళ్లు కూడా చెరువులకు చేరేలా చేయాలి. పడబాటు నీళ్లు కూడా కిందనున్న చెరువులకు నేరుగా పోవాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరు అందిస్తే, దాని ద్వారా మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే, మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడవచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు అందుతుంది. దీనికోసం అవసరమైన ఫీడర్ కెనాల్స్ వ్యవస్థను పునరుద్ధరించాలి. ఇంజనీరింగ్ అధికారులతో వర్క్ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ఈ సీజన్లోనే పనులు ప్రారంభం కావాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.