ఏపీ వ్యవసాయ శాఖామంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. కాగా సర్వేపల్లి అసెంబ్లీ స్థానానికి సోమిరెడ్డి పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా పత్రాన్ని అందించారు సోమిరెడ్డి. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన సోమిరెడ్డికి రెండవ విడతలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిత్వం ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.
మంత్రిగా ఆయన బిజీగా ఉండటంతో సర్వేపల్లి బాధ్యతలు చూసుకోవడానికి ఆయన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సర్వేపల్లి టీడీపీ కో ఆర్డినేటర్ గా నియమించారు. అయితే 2019 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారసుడే సర్వేపల్లి నుండి ఎన్నికల బరికలోకి దిగుతారు అని జోరుగా ప్రచారం సాగింది.
రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గంలో తన ఇమేజ్ ని పెంచుకునేందుకు పార్టీ తరపున కార్యక్రమాలలో యాక్టివ్ రోల్ పోషించేవారు. దీంతో ఆయనే పోటీ చేస్తారని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం సాగింది. కానీ అనూహ్య రీతిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే పోటీ చేయనున్నారు అని తెలియడంతో ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అయింది.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేసి సోమిరెడ్డిపై గెలుపొందారు. ఈసారి కూడా ఆయనకే టికెట్ ఇస్తే కాకానిపైన రాజగోపాల్ రెడ్డి గెలవడం కష్టం అవుతుందని టీడీపీ భావిస్తోందట. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సోమిరెడ్డి అయితే కాకానికి గట్టి పోటీ ఇవ్వగలరు అనే ఉద్దేశంతోనే సోమిరెడ్డిని బరిలోకి దింపనున్నట్టు సమాచారం.