ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కొత్త నేతలు రాజకీయాల్లోకి రావడం, నాయకులు పార్టీలు మారడంతో ఏ పార్టీని చూసినా… ఒకే టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు ముగ్గురు నేతలతో కిక్కిరిసిన పల్లెవెలుగు బస్సులా కిటకిటలాడుతూ, టికెట్ దక్కుతుందో లేదో అని ఆశావహుల ఉత్కంఠతో పైకి కళకళలాడుతున్నాయి పార్టీలన్నీ.
ఇతర పార్టీలో బలమైన నేతలని లాక్కోవడానికి, తమ పార్టీ నేతలు బయటకు పోకుండా కాపాడుకోవడానికి వ్యూహాలు చేస్తూ బిజీగా ఉన్నారు అధినేతలు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఎంపీ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ తో భేటీ అవ్వనున్నారు. ఆ వివరాలు కింద చదవండి.
విశాఖపట్టణం అనకాపల్లి టీడీపీ పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం. పార్టీ మారే అంశంపై వైసీపీ ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చలు జరిపారు. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గురువారం సాయంత్రం భేటీ అవ్వనున్నారు అవంతి.
వైసీపీలోకి తీసుకొచ్చేందుకు అధిష్టానం ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చినట్టు ముఖ్యవర్గాల సమాచారం. అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేసిన భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు, మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన జగన్, అవంతిల భేటీ అనంతరం వెలువడనుంది. ఇప్పటికే భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి విజయనిర్మలతోపాటు మరి కొందరు భీమిలి వైసీపీ నేతలు హైద్రాబాదుకు బయలుదేరారు.
2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికైన ఆయన అనంతరం టీడీపీ నుండి అనకాపల్లి ఎంపీ సీటుకి పోటీ చేసి గెలుపొందారు. కాగా ఆయన పార్టీలో అసంతృప్తితో ఉండటాన్ని గ్రహించిన వైసీపీ నేతలు వెంటనే అలెర్ట్ అయ్యారు. ఆయన పార్టీలో ఉంటే పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని భావించిన అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చి మరీ పార్టీలోకి తెచుకుంటున్నట్టు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అవంతితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. కానీ అవంతి మాత్రం ఆయన మొబైల్ నంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన మాత్రం టీడీపీని వీడేందుకు బలంగా ఫిక్స్ అయ్యారని, టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అంటున్నారు అవంతి సన్నిహితులు.