2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తనకు జన్మనిచ్చిన రాయలసీమకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. శ్రీబాగ్ అవగాహన మేరకు రాయలసీమలో ఉండాల్సిన రాజధానిని అమరావతికి తరలించారు. చివరకు హైకోర్టును కూడా సీమకు ఇవ్వడానికి నిరాకరించారు. వివక్షకు పరాకాష్టగా సాహిత్య అకాడమీలో కుడా రాయలసీమ వారిని నియమించకుండా అధ్యక్షుడు , ఉపాధ్యక్షుడుతో సహా కమిటిలోని 11 మందిలో కేవలం ఒక్కరినే నియమించారు. 13 జిల్లాల రాష్ట్రంలో 9 జిల్లాల కోస్తా వారికి కీలకమైన అధ్యక్ష , ఉపాధ్యక్షుడితో సహా 10 మందికి అవకాశం కల్పించి 4 జిల్లాల రాయలసీమకు మాత్రం కేవలం ఒక్కరికే ఇవ్వడం దుర్మార్గం.
రాయలసీమలో గొప్పవారు లేరా కేతు విశ్వనాథ రెడ్డి , సింగమ నేని నారాయణ , వెంకటరెడ్డి , బండి నారాయణ స్వామి , హరికిషన్ , జాతీయ యువ సాహితీ అవార్డు గ్రహీత అప్పి రెడ్డి హరినాథ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో జాతి గర్వించదగ్గ గొప్ప సాహితీ వేత్తలకు నిలయం రాయలసీమ.
కుట్రలో భాగంగా నే చూడాల్సి వస్తుంది
రాయలసీమ చరిత్ర , సంస్కృతి మీద చాలా కాలం నుంచి దాడి జరుగుతుంది. సీమ అంటే గొడవలు , హత్యలు మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రాయలసీమ గొప్ప చరిత్రకు , జాతి గర్వించదగ్గ గొప్పవారికి పుట్టినిల్లు అకాడమీలో తగిన ప్రాధాన్యత ఇస్తే వాస్తవాలు ప్రపంచానికి తేలిసిపోతుంది అన్న భయమా లేదా సీమ సాహితీ వేత్తలు రాయలసీమ గొప్పతనాన్ని ప్రపంచానికి తమ రచనల ద్వారా తెలియజేస్తున్నారన్న ఆక్రోషమా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
రాయలసీమ పట్ల ప్రేమను ఒలకబోస్తూ రాజకీయాలు చేస్తున్న బాబుకు మాప్రశ్న ఒక్కటే ఆంధ్ర ప్రదేశ్ దేశంలో భాగం కాదా అని మోడీని ప్రశ్నస్తున్న ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ భాగం కాదాఅని ప్రశ్నించుకోవాలి.
వెంటనే కమిటీని పునర్వ్యవస్థీకరణ చేసి రాయలసీమ వారికి సముచిత స్థానం కల్పించాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండు చేస్తోంది. సాహితీ అకాడమీ నియమకంలో కూడా రాయలసీమ పట్ల వివక్ష చూపిన ప్రభుత్వ చర్యను రాజకీయాల కతీతంగా ఖండించాలని సీమ ప్రజలకు విజ్ఞప్తి.
యం. పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం