ఈమధ్య కాలంలో అరవింద్ అఘోర మీడియాలో బాగా హాట్ టాపిక్ అయ్యారు. తెలుగు ఛానెల్స్ ఆయన ఇంటర్వ్యూలు చేసి రేటింగ్స్ పెంచుకునే పనిలో పడ్డారు. అయితే ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సావిత్రి, ఎన్టీఆర్ లకు వీరాభిమానిని అని వెల్లడించారు. అంతేకాదు సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలోని ఒక పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే ఆ పాటను తన కాలర్ ట్యూన్ గా పెట్టుకున్నని తెలిపారు.
ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు ఆయన జర్నలిస్టుగా ఉన్నానని, ప్రజలు దేవుడిలా భావిస్తున్నప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేసారని అన్నారు. అంతేకాదు ఇద్దరు అంతర్గత శత్రువులే ఆయనకు రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచారని అరవింద్ అఘోర సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
ఎన్టీఆర్ కి రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు వెన్నుపోటు పొడిచారు. మొదటి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ఒక నెల ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితికి వెళ్లిపోయారు. ఇప్పుడు బయోపిక్ ల పుణ్యమా అని మీడియా ముందుకు వచ్చి చనిపోయిన మనిషి గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అరవింద్ అఘోరా.
ఆ తర్వాత కుటుంబ సభ్యుడే అయిన ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబే వెన్నుపోటు పొడిచారు. నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ నాదెండ్ల భాస్కరరావుని ప్రజలు వ్యతిరేకించడానికి, చంద్రబాబుని అంగీకరించడానికి కారణం ఆయన ఎన్టీఆర్ అల్లుడు కావడమే అన్నారు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి చంద్రబాబు ఎన్నికల్లో నెగ్గారన్నారు.
ఎన్టీఆర్ నిజమైన అభిమానులు లక్ష్మీ పార్వతిని భార్యగా అంగీకరించాలి అన్నారు. ఆయన అందం చూసి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోలేదు. ఆయన పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో ఆత్మకథ రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ బాగోగులు చూసుకుంది. ఆమెపై కృతజ్ఞతతో ఆయన రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఎన్టీఆర్ ఆమెను రెండవ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఆమెను అంగీకరించాలి. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆయన భార్యగా లక్ష్మీపార్వతిని గౌరవించాలి అని అభిప్రాయం వ్యక్తం చేసారు అరవింద్ అఘోరా.