ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాత విజయ బాపినీడు మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తన తుది శ్వాస విడిచారు. టాలీవుడ్ కి ఎన్నో సేవలు అందించిన ఆయన మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
బాపినీడు 1936 సెప్టెంబరు 22 న చాటపర్రులో జన్మించారు. ఆయన అసలు పేరు గుట్టా బాపినీడు చౌదరి. ఇండస్ట్రీకి వచ్చాక తన పేరును విజయ బాపినీడుగా మార్చుకున్నారు. సిఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుని జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. సినీరంగం మీద ఇష్టంతో రచయితగా, దర్శకుడిగా మారారు. నిర్మాతగా కూడా ఆయన పేరు సంపాదించుకున్నారు. చిరంజీవి నటించిన మగమహారాజు సినిమాతో దర్శకుడిగా మారారు.
ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించిన ఆయన వెండితెరకు ఎందరో ప్రముఖుల్ని పరిచయం చేసారు. ఆయన మరణ వార్తతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. చిరంజీవి స్టార్ హీరోకి ఎదగడానికి కీలకంగా వ్యవహరించిన బాపినీడు మరణంతో చిరు ఫ్యామిలీ తీవ్ర ఆవేదనకు లోనయ్యింది. వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవితో మరో సినిమా తీయాలి అనుకున్న బాపినీడు చివరి కోరిక తీరకుండానే మరణించడం బాధాకరం అంటున్నారు సినీ వర్గాలు.