తెలంగాణ కాంగ్రెస్ పై పద్మశాలి లీడర్లు సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై పద్మశాలి నేతలు ఆగ్రహంగా ఉన్నారు. 31 మంది డీసీసీ అధ్యక్షుల ను నియమిస్తే అందులో ఒక్క పద్మశాలి కి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం దారుణం అని వారు అంటున్నారు.
ఈ సమయంలో పద్మశాలి నాయకుడు ఒకరు తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఆయన రాసిన ఒక పోస్ట్ ను కింద ప్రచురిస్తున్నాం. చదవండి.
*పద్మశాలీ సంఘ నాయకులకు నమస్కారం*
ఈ మెసేజ్ కొంచం బాధతో పెడుతున్నాను. వేదికలపై ఎక్కిన వెంటనే మన సంఘ నాయకులు తప్పక మాట్లేడే మాట పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి అని. కానీ ఎలా ఎదగాలి, ఏం చేసి ఎదగాలి, ఎదగాలంటే ఏం చేయాలి అని మాత్రం ఎవ్వరూ చెప్పరు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినయి… మన కులానికి అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 3 ప్రధాన పార్టీలు తలా ఒక స్థానంలో టికెట్ కేటాయించినప్పటికి ఒక్క స్థానంలో కూడా మన వారిని గెలిపించుకోలేకపోయాము. ఫలితంగా ఇతర బడుగు కులాలలో పరువు పోగొట్టుకున్నాము.
ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా, నేటి వరకు మన పద్మశాలి కుల సంఘ రాష్ట్ర నాయకులు ఈ ఓటమిని విశ్లేషించే కార్యక్రమం ఇప్పటికీ చేపట్టలేదు. ఈ నాయకులు మన సంఘానికి ఆశనిపాతంలా మారారని చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. ఇందులో మన పద్మశాలి కులానికి చెందిన ఒక్క వ్యక్తిని కూడా అధ్యక్షునిగా నియమించలేదు. రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, వైశ్యులు, మున్నూరు కాపులు, గౌడలు, యాదవులు, ముదిరాజులు, మాదిగ, మాల, లంబాడా, ముస్లిం తదితర కులాలకు ప్రాతినిధ్యం కల్పించిన కాంగ్రెస్జ్ పార్టీ, మన కులాన్ని విస్మరించడం చాలా బాధాకరం.
ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పిదమే అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా కూడా మనకు ఏమంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపించడం లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే అన్ని పార్టీలు మన కులాన్ని కావాలనే పనిగట్టుకొని అనగదొక్కుతున్నాయా అనే అనుమానం రాక మానదు. ఇదే నిజమైతే పద్మశాలీల రాజకీయ భవిష్యత్తు ఏమిటి? చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులం సమాజంలో మనుగడ సాధించగలదా? మన కుల మరియు వృత్తి దారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకపోయే నాయకుడు లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మన కులాన్ని రాజకీయంగా సమాధి చేస్తున్నది ఎవరు? ప్రధాన రాజకీయ పార్టీల్లో మన పద్మశాలీ నాయకులకు లభిస్తున్న గౌరవం ఎంత? అసలు ఈ దుస్థితికి కారణం ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో మనస్సుని తొలిచివేస్తున్నాయి.
వీటికి సమాధానం వెదుక్కోవడం మన బాధ్యత కాదా? లేక ఎన్నో ప్రశ్నల్లాగా ఇవి కూడా సమాధానం లేని ప్రశ్నల్లాగానే వదిలేద్దామా? పద్మశాలి కులాభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ఈ మెసేజ్ కి స్పందించి తమకు తోచిన సమాధానం/విశ్లేషణ/స్పందన తెలపాలని కోరుకుంటూ…
మీ…
*గుండేటి శ్రీధర్
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,
తెలంగాణ పద్మశాలి యువజన సంఘం.
9989864789

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *