తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత వైభవాన్ని సంతరించుకుంటున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. కోట్లాది రూపాయలతో యాదగిరీశుడికి కొత్త శోభ తెచ్చి పెడుతున్నది తెలంగాణ సర్కారు. తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదగిరిగుట్ట దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. మరికొద్దిరోజుల్లో యాదాద్రి పర్యాటక ప్రాంతంగా కూడా మరింత ఆదరణ పొందనున్నది.
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట పోవాలంటే మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి మీదుగా పోవాలె. భువనగిరి హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాదాద్రి వెళ్లిన వారు పోయేటప్పుడైనా, లేదా వచ్చేటప్పుడైనా భువనగిరిలోని రామస్వామి యాదవ్ భోజనశాలలో లంచ్ చేయాల్సిందే అంటున్నారు అక్కడ భోజనం చేసిన యాత్రికులు. ఇంతకూ రామస్వామి యాదవ్ భోజనశాలకు అంత ప్రత్యేకత ఏంటబ్బా అనుకుంటున్నారా? అయితే స్టోరీ చదవండి.
అది 1948 ప్రాంతం… ఇండియాకు స్వాంతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ స్టేట్ కు రాలేదు. నిజాం రాజ్యం నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం 1948లో దక్కింది. సరిగ్గా 1948 తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నవేళ భువనగిరి (ఇప్పటి యాదాద్రి జిల్లా రాజధాని)లో చిన్న గుడిసెలో ఈరబోయిన రామస్వామి యాదవ్ ఒక మెస్ ప్రారంభించారు. ఆ మెస్ కు రామస్వామి యాదవ్ భోజనశాల గా తన పేరు పెట్టుకున్నారు. అప్పుడు భువనగిరి పట్టణంలో గుడిసెలో ప్రారంభమైన రామస్వామి యాదవ్ భోజనశాల 72ఏళ్లుగా స్థానిక ప్రజలకు, యాదగిరిగుట్టకు వచ్చి వెళ్లే యాత్రికులకు రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నది.
రామస్వామి యాదవ్ అనంతరం భోజనశాలను ఈరబోయిన నర్సమ్మ, లక్ష్మయ్యలు కొనసాగించారు. వారి తర్వాత వారి అల్లుడు బోలబోయిన శివశంకర్ యాదవ్ ప్రస్తుతం భోజనశాలను నడుపుతున్నారు. శివశంకర్ యాదవ్ కు మెస్ నిర్వహణలో ఆయన తనయుడు శివ నాగరాజు యాదవ్ సహకారం అందిస్తున్నారు. శివనాగరాజు యాదవ్ ఎంబిఎ చదివినా హోటల్ నిర్వహణ విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా పనిచేస్తాడని తండ్రి చెబుతున్నారు. టేబుల్ క్లీన్ చేయడం, తిన్న ప్లేట్ లు తీయడం వంటి పనులన్నీ చేస్తాడని అన్నారు. తన తర్వాత శివనాగరాజు ఈ భోజనశాల బాధ్యతలు చేపడతాడని చెప్పారు.
కాలం వేగంగా మారిపోతున్నది. గతంలో ఉన్న మెస్ లు ఇప్పుడు మూతపడిపోతున్నాయి. హోటళ్లు పేర్లు మార్చుకుని రెస్టారెంట్లు గా మారిపోతున్నాయి. కానీ 70 ఏండ్ల కిందట పెట్టిన భోజనశాల అనే పేరును అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు రామస్వామి యాదవ్ వారసులు. వ్యాయామశాల, భోజనశాల అనే పేర్లు పాఠ్యపుస్తకాల్లో తప్ప బయట పెద్దగా మనుగడలో లేవు. కానీ రామస్వామి యాదవ్ భోజనశాల పేరును అలాగే కాపాడుకుంటూ వచ్చారు ఆ హోటల్ నిర్వాహకులు.
ఏమిటి రామస్వామి యాదవ్ భోజనశాల ప్రత్యేకత ?
రామస్వామి యాదవ్ భోజనశాలలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆహారం దొరుకుతుంది. తాజా కూరగాయలతో ఇక్కడ వంటలు చేస్తారు. ఇప్పుడు ఈ భోజనశాలలో వెజిటేరియన్ భోజనం ధర 70 రూపాయలు. ఈ హోటల్ లో ఫ్రై ఐటమ్స్ మచ్చుకు కూడా కనిపించవు. మాంసాహారం కూడా ఫ్రై చేయరు. మటన్, చికెన్ కూడ నీళ్లు కలిపి వండి వడ్డిస్తారు తప్ప వేయించిన ఆహారం మాత్రం ఇక్కడ ఉండదు. పచ్చి పులుసు, సల్ల పులుసు, పప్పు, పచ్చడి, కూరలు అన్నీ కూడా నీరు పోసి వండుతారు. ఫ్రై అనే ఐటమ్ మా భోజనశాలలో ఉండదు అని చెబుతారు హోటల్ నిర్వాహకులు బోలబోయిన శివశంకర్ యాదవ్. తాజా కూరగాయలు, క్వాలిటీ నూనెలు, క్వాటిలీ మసాలాలు వాడతామని ఆయన చెబుతారు. అందుకే తమ భోజనశాల కిటకిటలాడుతూ ఉంటుందని గర్వంగా చెబుతారు. ఏ వయసు వారికైనా సులభంగా జీర్ణమయ్యేలా ఈ హోటల్ లో ఆహారపదార్థాలు తయారు చేస్తామని అంటున్నారు. ఇంటిభోజనం రుచి మాదగ్గర దొరుకుతుందని అందుకే వినియోగదారుల నుంచి తమకు గుర్తింపు దొరికిందని చెబుతున్నారు.
తొలి తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి ఈ మార్గంలో వచ్చిపోయే సందర్భంలో ఇక్కడే లంచ్ చేస్తారు. మధుసూదనాచారి గత 12 ఏళ్లుగా ఇక్కడే భోజనం చేస్తున్నట్లు చెప్పారు శివశంకర్. ఆయనే కాదు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలంతా హైదరాబాద్ కు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేసి పోతారని శివశంకర్ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యేలు దుగ్యాల శ్రీనివాసరావు, మందాడి సత్యనారాయణరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ తోపాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు ఇక్కడ భోజనం చేసినవారే అని చెబుతారు శివశంకర్. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వచ్చి భోజనం చేసి పోతారని ఆయన వివరించారు.
అప్పట్లో మోదుగాకులు, తామర ఆకుల్లో పెట్టినం…
తమ భోజనశాలకు వచ్చే వారికి గతంలో మోదుగాకుల్లో భోజనం పెట్టినట్లు శివశంకర్ తెలిపారు. మోదుగాకులతో కూడిన విస్తార్లు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. అంతకుముందు తామర ఆకుల్లోనూ వడ్డించిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బాదాము ఆకుల్లోనూ వడ్డించినట్లు చెప్పారు. కానీ కాలం మారిపోవడం, మోదుగు, తామర, బాదం ఆకుల లభ్యత లేకపోవడంతో ఇప్పుడు మాత్రం అన్ని హోటళ్లలో మాదిరిగానే యూజ్ అండ్ త్రో ప్లేట్లలో భోజనం వడ్డిస్తున్నారు. యాదాద్రి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఇక్కడి నుంచి క్యాటరింగ్ ద్వారా భోజనాలు తెప్పించుకుంటున్నట్లు చెప్పారు.
వరంగల్ రోడ్ లో వెళ్లేవారైనా, యాదాద్రి కి వెళ్లే భక్తులైనా మార్గమధ్యలో భువనగిరి పట్టణం నడిబొడ్డున ఉన్న రామస్వామి యాదవ్ భోజనశాలలో మీరూ ఒకసారి భోజనం తిని చూడండి మరి. ఈ భోజనశాల ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టమర్లకు భోజనం అందిస్తుంది. రాత్రి డిన్నర్ లేదని నిర్వాహకులు చెప్పారు.