ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.సార్వత్రిక ఎన్నికలకు మరో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే టార్గెట్గా సర్వశక్తులు ఒడ్డుతున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికార టీడీపీని దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేకు ,స్ధానిక నాయకత్వంకు మధ్య అసలు పొసగడం లేదు. ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న నేతలు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేకు అసలు సహకరించడం లేదు.దీంతో అలాంటి చోట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కొద్ది రోజులకే అధికార టీడీపీలో చేరారు. అయితే అక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీత, ఆమంచి రాకను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు.దాంతో పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన సీఎం చంద్రబాబు..ఆమెకు ఇటీవల తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని కూడా అప్పగించారు. అయితే తన ప్రత్యర్ధి పోతుల సునీతకు పార్టీ అధిష్టానం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనే అసంతృప్తి ఆమంచిలో ఎప్పటి నుంచో కాస్త ఉంది. దీంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూ వస్తుంది.కానీ తాను పార్టీ మారేది లేదంటూ ఆయన చెప్పుకొస్తూ వస్తున్నారు.
కాగా, ఆమంచి పార్టీ మారుతున్నట్లు కొద్ది రోజులుగా మరోసారి మీడియాలో వార్తలు వస్తుండటంతో టీడీపీ అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపట్టింది. బుధవారం తన సొంత గ్రామంలో కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి..పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. దాంతో వెంటనే టీడీపీ బుజ్జగింపు చర్యలు చేపట్టింది. చంద్రబాబు ఆదేశాలతో పార్టీ మారొద్దంటూ ఆమంచిని బుజ్జగించే ప్రయత్నం చేశారు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు .ఈ తరుణంలో చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో గురువారం అమరావతిలో సీఎంతో ఆమంచి భేటీ అయ్యారు. చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడారు.ఈ భేటీ అనంతరం ఆమంచి చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాలను షాక్కు గురి చేస్తున్నాయి.
ఆమంచి వైసీపీలో చేరడం ఖాయమనుకున్న క్రమంలో చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. చంద్రబాబుతో అన్ని విషయాలు చర్చించానని, సీఎం నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. అయితే ఎలాంటి హామీ ఇచ్చారనేది ఇప్పుడు బయటికి చెప్పలేనన్నారు. శుక్రవారం కార్యకర్తలతో చర్చించి వివరాలు చెబుతానని ఆమంచి పేర్కొన్నారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు ఆమంచి చెప్పిన వ్యాఖ్యలను బట్టి చూస్తే పార్టీమారే ఆలోచనను ఆయన విరమించుకున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో ఆమంచి చేరాతారని ఆశించిన వైసీపీ వర్గాలకు ఆయన చేసిన వ్యాఖ్యలను షాక్కు గురిచేసేలా ఉన్నాయి.