సార్వత్రిక ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం రేణిగుంట సమీపంలో యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వైసీపీ సమరశంఖారావ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించిన జగన్ రానున్న ఎన్నికల్లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా కృషి చేయాలని వైసీపీ వర్గాలకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు సవ్యసాచులై పని చేయాలన్నారు. అంతేకాదు ఓటర్లను ఆకర్షించే దిశగా భారీ ప్రకటన కూడా చేశారు జగన్. ఈ ప్రకటనతో టీడీపీకి దిమ్మ తిరగడం ఖాయం అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఆయన ఏం మాట్లాడారో కింద చదవండి.
వచ్చే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే ఎన్నికలు. ఆప్యాయతకు మధ్య జరిగే ఎన్నికలు. ఈ ప్రభుత్వంలో కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. అవమానాలు భరించారు. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలింది. ప్రతి ఒక్కరి బాగోగులు నేను చూసుకుంటా. మీకు అండగా ఉంటా. రాజకీయ పార్టీల్లో మిమ్మల్ని కార్యకర్తలు అంటారు. కానీ మన పార్టీలో మాత్రం మీరంతా నా కుటుంబ సభ్యులే అని కార్యకర్తల్ని ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు జగన్.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే మీరందరూ బాధ్యత తీసుకోవాలి. మనందరి ప్రభుత్వం కోసం సవ్యసాచులై పని చేయాలి. రెండు నెలలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఓటరు ఓటు వేసేలా బూత్ కమిటీలు బాధ్యత తీసుకోవాలి. ఓటర్లు చంద్రబాబు ప్రలోభాలకు లోను కాకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత ఎన్నికల మాదిరే రాబోయే ఎన్నికల్లో కూడా ఎవరితో పొత్తు ఉండదు అని తేల్చి చెప్పారు జగన్.
ఈ సందర్భంగా జగన్ వృద్ధులకు భారీ హామీ ప్రకటించారు. జగన్ నవరత్నాలలో వృధాప్య పింఛన్ రెండువేలు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు వృధాప్య పింఛన్ రెండువేలకు పెంచారు. దీంతో నవరత్నాలను కాపీ కొడుతున్నారంటూ టీడీపీపై వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రెండువేలు ముందే ఇవ్వడంతో జగన్ తెలివిగా వృధాప్య పింఛన్ మూడువేలు చేసి టీడీపీకి కౌంటర్ ఇచ్చారు.