ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్ని వ్యూహలు పన్నుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి పార్టీలన్నీ.
ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా వరాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే నవరత్నాల పేరుతో తొమ్మిది హామీలను ప్రకటించిన వైసీపీ, వాటిని ప్రజల్లోకి క్షేత్రస్ధాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా… అధికారాన్ని నిలుపుకునేందుకు టీడీపీ వరాలు కురిపిస్తుంది.
దళిత కైస్త్రవులను ఎస్సీలో చేర్చాలని
తాము చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా…ఎన్నికల వేళ అన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో రూ.200గా ఉన్న ఫించన్‌ను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు రూ.2000 పెంచడంతో ఫించన్ లబ్దిదారుల్లో హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు తన మానస పుత్రికగా చెప్పుకునే డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం ద్వారా రూ.10,000ను మూడు విడతలుగా అందిస్తోంది టీడీపీ ప్రభుత్వం. అలాగే నిరుద్యోగులకు ఇచ్చే రూ.1000లను రూ.2 వేలు పెంచిన చంద్రబాబు, రైతులకు కూడా వరం ప్రకటించారు. అన్నదాత సుఖీభవ అనే పథకాన్నిత్వరలో ప్రారంభించనున్నారు.
అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే దిశగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే బీసీ సామాజికవర్గంలో అందరికీ కార్పొరేషన్ ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం…క్షత్రియులకు కూడా కార్పొరేషన్ ప్రకటించారు. ఇక కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు… బుధవారం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.
దళిత కైస్త్రవులను ఎస్సీలో చేర్చాలని చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం దీనికి సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో స్వయంగా చంద్రబాబు ప్రవేశపెట్టగా… అసెంబ్లీ దీనికి అమోద్రముద్ర వేసింది.
దీంతో ఈ బిల్లును కేంద్రానికి పంపించి…దళిత కైస్త్రవులను ఎస్సీలో చేర్చేలా కేంద్రంపై టీడీపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురానుంది. దళిత ఓట్ బ్యాంకు వైసీపీకి ఎక్కువ ఉండటంతో ఆ ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవటం వైసీపీ వర్గాలకు షాక్ కు గురి చేసినట్లయింది.