తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలను ప్రకటించింది ప్రభుత్వం. నారాయణపేట, ములుగు జిల్లాలను ప్రకటించింది. అయితే గతంలో మాదిరిగానే కొత్త జిల్లాల చిచ్చు ఇప్పుడు ఈ రెండు జిల్లాల పరిధిలోనూ రాజుకున్నది. పోలీసు లాఠీఛార్జి వరకు వచ్చింది పంచాయితీ. నారాయణపేట జిల్లా విషయంలో ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పూర్తి వివరాలు చదవండి. వీడియో కింద ఉంది.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న నారాయణపేట ను ప్రత్యేక జిల్లాగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఈ జిల్లా పరిధిలో పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కోయిల్ కొండ మండలాన్ని కలుపుతున్నట్లు ప్రకటించింది సర్కారు. అయితే కోయిల్ కొండ ప్రజలు తమను నారాయణపేట జిల్లాలో కలపడాన్ని అంగీకరించడంలేదు. తమను పాత మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై కోయిల్ కొండ మండలానికి చెందిన అనేక గ్రామాల ప్రజలు ధమాయిపల్లి వద్ద ఆందోళకు దిగారు. ధర్నా చేపట్టారు. ధర్నా కార్యక్రమం శృతి తప్పింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య గొడవ జరిగింది. ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇదే సమయంలో పోలీసుల మీద ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు.
ఈ వివాదంలో సిఐ పాండురంగారెడ్డి తలకు గాయాలయ్యాయి. ఆయనను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరికొందరు పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పలువురు ఆందోళనకారులు పోలీసులు లాఠీఛార్జిలో గాయపడ్డారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పాలమూరు జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జిల్లా పోలీసులు ప్రకటించారు.