కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ మాజీ మంత్రి, ప్రస్తుత సిద్ధిపేట టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయనేమన్నారో చదవండి.
కేసీఆర్ వల్ల నాకు రెండు లాభాలు జరిగాయి. కేసీఆర్ పార్టీ పెట్టడంతో నేను ఎమ్మెల్యే గా గెలిచే అవకాశం దొరికింది. అలాగే ఇక నన్ను కేసీఆర్ జైళ్ల పెట్టినా నా కూతురు జయారెడ్డి రాజకీయ వారసురాలు అయింది.
నాకు కేసీఆర్ కి ఎలాంటి వైరుధ్యం లేదు. నన్ను జైల్లో పెట్టడానికి ప్రధాన కారణం హరీష్ రావే. హరీష్ రావు ఉనికి కోసమే నన్ను జైల్లో పెట్టించిండు.
కేసీఆర్ పై కాని ఆయన కుటుంబ పై నేను వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కేవలం నేనెప్పుడూ రాజకీయ విమర్శలే చేశాను. నాకు మూడు పార్టీలతో సంబంధాలున్నాయి. బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ లను కలుస్తా. నేను కాంగ్రెస్ పార్టీని వీడను. వేరే పార్టీలో చేరను. హరీష్ రావు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్. నేను హరీష్ ను ఎప్పుడైనా నమ్మను. ఆ మాటకొస్తే హరీష్ రావు కంటే కేటీఆర్ చాలా ఫెయిర్.
హరీష్ రావు 2008లో కేవీపీ ద్వారా మంతనాలు జరిపిండు. కాంగ్రెస్ లకు పోయేందుకు ప్రయత్నం చేసిండు. కానీ కుదరలేదు. హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ మారితే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే.
నేను జైల్లో వున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ లు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ లోని హేమా హేమీలు గా ఉన్నవారు ఎవరూ నా దగ్గరకు రాలేదు. నాకు కష్టం వస్తే ఎవరూ ఆదుకోలేదు. నాకు రాహుల్ గాంధీ అంటే చాలా పిచ్చి. అందుకే పార్టీని మారను.
బిజెపి ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీచేయడం నా పొరపాటు. అలా చేసి ఉండాల్సింది కాదు.
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు మాత్రమే నేను మీడియాకు చెప్తున్నా. మీడియా ద్వారానే రాహుల్ కి విషయాలు తెలవాలి.
నన్ను ప్రచార కమిటీలో మెంబర్ గా నియమించారు. నేను ప్రచార కమిటీలో ఉన్నప్పటికీ…నన్ను చూసి ఓట్లు ఎవరు వేయరు. కాంగ్రెస్ లో లాబీయిస్టుల హవా నడుస్తోంది. ఇప్పుడు పదవులు వచ్చిన వారికి కూడా అలాగే వచ్చాయి.