హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లిఖార్జునరెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో వివరించారు. టీడీపీని ఎందుకు వీడారో వివరించారు. ఈ సందర్భంగా అధికార ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. వైసీపీలో తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండనుండో వివరించిన ఆయన పార్టీలో చేరేముందు జగన్ తనకి ఏం సూచించారో తెలిపారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీలో చేరిన అనంతరం హైద్రాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే… కడపజిల్లాలో ఒకే ఒకడిగా టిడిపికి గౌరవం తెచ్చిన ఎంఎల్ఏగా నేను ఉంటే, నాకు గౌరవం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం నిజంగా చాలా భాదవేసింది. ఆరోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే మాట చెబుతున్నాం. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే సిఎం కాబట్టి వారి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజంపేట ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సూచన చేయాలని నిర్ణయించుకున్నాం.
రాష్ట్రంలో దోపిడీ జరుగుతోంది. ఇవన్నీ కూడా అరికట్టాలంటే వైయస్ ఆశయాలమేరకు పరిపాలన రావాలంటే బడుగుబలహీన వర్గాలను ఆదరించే సిఎంగా జగన్ ముందుకు వెళ్తారు. కాబట్టి ఆయన సమక్షంలో ఈ పార్టీలో చేరాం. టిడిపి మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలియని వారం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలు 23 మందిని ప్రలోభపరిచి టిడిపి వారు కొన్నారు అంటూ ఆరోపించారు.
మీరు పార్టీలో చేరే ముందు టిడిపి ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రమ్మని జగన్ నాకు సూచించారు. దాంతో 22 వతేదీనే ప్రభుత్వ విప్ పదవికి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశాను. ఈరోజు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా పంపాను. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేయాలి. అన్నివర్గాల వారికి మంచి జరిగేలా పరిపాలన జరగాలి. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా చూస్తున్నాం. చంద్రబాబునాయుడు ఐదేళ్ల కాలంలో ప్రతి వర్గాన్ని దగా చేశారు. రైతాంగాన్ని, డ్వాక్రామహిళలను, నిరుద్యోగ యువతిని కాపులను అందర్ని మోసం చేయడం జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు మేడా.
ప్రజలు గమనించాలి. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను మీరు నమ్మకండి. ప్రజలు చంద్రబాబును ఛీఛీ కొడుతున్నారు. నిన్ను నమ్మం బాబు నమ్మం అని ప్రజలు అంటున్నారని ఘాటుగా విమర్శించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమర్నాథ్ రెడ్డి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వారి ఆశయాలకు అనుగుణంగా రాజంపేట నియోజకవర్గంలో ఆయనను కలుపుకుని ముందుకు వెళ్తాం అని తెలిపారు మేడా మల్లిఖార్జునరెడ్డి.