దివంగత సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు, కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి, రాయలసీమ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. సోమవారం రాత్రి ఆయన తన శ్రీమతి, డోన్ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, కొడుకు రాఘవేంద్రరెడ్డితో కలిసి సీఎం ఇంట్లో విందుకు హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీలో చేరే విషయంపై చర్చలు జరిపేందుకు వెళ్లారని భావించారంతా… కానీ ఆయన మాత్రం అందుకు కాదంటున్నారండీ..!! అందుకు కాకపోతే మరెందుకు వెళ్ళినట్టో….? ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.
అమరావతిలో సీఎంతో భేటీ అనంతరం బుధవారం కర్నూలుకు చేరుకున్న కోట్ల మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేయాలి అని తీసుకున్న నిర్ణయంతో విభేదించి బయటకు వచ్చాను. ఇప్పటి వరకు నాటో ఎవరూ ఈ విషయంపై సంప్రదింపులు జరపలేదు. ఇకమీదట స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసినా కాంగ్రెస్ లో ఉండలేను” అని తేల్చి చెప్పారు కోట్ల. ఇక్కడి వరకు ఓకే. కానీ అసలు మ్యాటర్ కి వస్తే చంద్రబాబుతో భేటీపై ఆయన ఎవరూ ఊహించని విధంగా స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో తమ కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే ఆయన మమ్మల్ని కలవాలని ఆహ్వానించడంతో కలవడానికి వెళ్ళాం. ఈ సమావేశంలో టీడీపీలో చేరమని నన్ను అడగలేదు. జిల్లా సమస్యల గురించి అడుగగా వివరించాను. గుండ్రేవుల జలాశయం, వేదవతి ప్రాజెక్టు, ఎల్ఎల్సీ బైపాస్ పైప్ లైన్ నిర్మిస్తే కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కరువుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని సూచించినట్లు తెలిపారు. వేదవతి ప్రాజెక్టుకు సీఎం జిఓ ఇచ్చారని అన్న ఆయన గుండ్రేవుల ప్రాజెక్టు కూడా ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
కాగా తనని పార్టీలోకి ఆహ్వానిస్తూ టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులూ సంప్రదించారని వెల్లడించారు కోట్ల. అయితే కార్యకర్తలు నిర్ణయమే తన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనీ నిర్ణయిస్తే అలానే చేస్తానని పేర్కొన్నారు.