ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 10,16 తేదీలలో ఏపీలో పర్యటించనున్నారు. అయితే ఆయనేదో ప్రచారానికి, చంద్రబాబుపై చవాకులు-పరాకులు చేయడానికి రావడం లేదు. భారీ ప్లాన్ తోనే వస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై గత నాలుగేళ్లుగా ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఒక ఎత్తైతే, ఈమధ్య కాలంలో ఆయన ప్రధాని మీద యుద్ధం ప్రకటించారు. రాష్ట్రానికి ప్రధాని ద్రోహం చేశారన క్యాంపెయిన్ చేస్తున్నారు. సాధ్యమయినంతవరకు ప్రధాని మోదీని అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని ఆంధ్రకు సహకరించకపోయినా తాను కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తెలుసుకువెళ్తున్నానని దానికి కియా మోటర్స్, పోలవరం, పట్టిసీమ వంటి మరెన్నో ప్రాజెక్టులతోపాటు పెంచిన పెన్షన్, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమలు సాక్ష్యమని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపి అంటే తీవ్ర వ్యతిరేకత కల్లించేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తున్నారు.
అయితే కేంద్రం నిధులివ్వలేదు, మొత్తం మేమే చేసాం అని చెబుతున్న ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చేందుకు మోడీ రంగంలో దిగనున్నారని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మీడియాకి తెలిపారు.
ఫిబ్రవరిలో రాష్ట్రంల ో ప్రధాని రెండుసార్లు పర్యటించి నిజానిజాలు ప్రజల ముందు పెడతారని కన్నా చెప్పారు. ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా మోడీ చలవేనంటున్నారు.
మోడీ చేసిన అభివృద్ధిని చంద్రబాబు తనదిగా చెప్పుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమేం చేసిందో, మోడీ ఆంధ్రా ఎందుకు వస్తున్నాడు? ఇలాంటి అంశాలపై ఆయన మీడియాకి తెలిపిన వివరాలు కింద ఉన్నాయి చదవండి.
కియా మోటార్స్ తెచ్చిందెవరు, పోలవరానికి, ఇతర ప్రాజక్టులకు కేంద్రం ఇచ్చిన నిధులెన్ని? ఈ విషయాలను ప్రజలకు వివరించేందుకు మోడీ ఆంధ్రవస్తున్నరని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఫిబ్రవరి10, 16 తేదీలలో ఎపి లో ప్రధాని మోడి పర్యటిస్తారు. అమిత్ షా కూడా మూడు వితలుగా వచ్చి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. కియా మోటార్స్ కు సంబంధించిన విషయంలో చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని బిజెపి చెబుతూ ఉంది. ఎందుకంటే కియా మోటార్స్ ను ఆంధ్రలో ఏర్పాటుచేయాలని ప్రతిపాదించిందే ప్రధాని మోదీ అని బిజెపి నేతలు చెప్పుతున్నారు. కేంద్రంఏది చేసినా దానిని తన క్రెడిట్ గా చెప్పుకోవడం చంద్రబాబు కు అలవాటుగా మారింది అని ఆయన ఎద్దేవా చేసారు.
‘పోలవరం మొత్తం తానే సొంతంగా నిర్మిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పోలవరంకు ప్రజలను తరలిస్తూ విహార కేంద్రంగా మార్చారు అంటూ కన్నా విమర్శించారు. ఇప్పుడు కియాను కూడా మోడి ద్వారా తీసుకువస్తే.. చంద్రబాబు తనదిగా చెప్పుకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా మోడీ వారితో ఒప్పించారు. అనంతపురంలో పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు వస్తే టిడిపి నేతలు అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టారు. టిడిపి అవినీతి దాహం తట్టుకోలేక వారు పారిపోయారు.’ అంటూ ఘాటైన ఆరోపణలు చేసారు.
’ప్రధాని కార్యాలయం స్పందించడంతో చంద్రబాబు వెంటనే కొరియా పర్యటన పెట్టుకుని సంస్థ ప్రతినిధులను కలిశారు. కేంద్రం కూడా కియా ఫ్యాక్టరీని ఎపికి ఇచ్చినట్లు చెప్పింది వాస్తవం కాదా? ఇప్పుడు మాట మార్చి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేసిందని బురద జల్లుతారు. చంద్రబాబు దమ్ము, ధైర్యం ఉంటే తాను చేసింది చెప్పుకునేవారు. ఆయన చేసిందేమీ లేదనే కేంద్రం చేసిన వాటిని తాను చేసినట్లుగా చెప్పుకుంటున్నారు,’ అని కన్నా అన్నారు. కన్నా ఏమన్నారంటే…
హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్షం పెడితే ఎవరెళతారు.. అందుకే అందరూ వ్యతిరేకించారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశం, ఆ డిమాండ్ తో ఆందోళన చేయడం సరికాదు. కానీ ఇంకా హోదాను బూచిగా చూపి పబ్బం గడుపుకోవాలని కొంతమంది చూస్తున్నారు. ఆనాడు హోదా కన్నా ప్యాకేజీ వల్లే మేలు జరుగుతుందని చంద్రబాబు ప్రకటించలేదా? ఆనాడు విభజన అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీ లు ఎపికి ఏమేమి కావాలో డిమాండ్ చేయకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వాటిల్లింది.
వంద ప్రశ్నలు చంద్రబాబు కు వేస్తే ఒక్క దానికీ ఆయన స్పందించలేదు. అందుకే హైకోర్టులో కేసు వేశాను అంటూ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాగా కన్నాపై టీడీపీ శ్రేణులు, అభిమానులు మండి పడుతున్నారు. రాష్ట్రానికి చెందినవాడై ఉండి కన్నా ఏపీ అభివృద్ధి కోసం తమ పార్టీ పెద్దలను నిలదీయలేకపోయారు.
చంద్రబాబుపై ప్రజల్లో పెరుగుతోన్న క్రేజ్ చూసి ఓర్వలేక కనీసం తమ పార్టీ మనుగడలో లేకుండా పోతుందేమో అని భయం పట్టుకుంది. చంద్రబాబు చేసిన అభివృద్ధిని ఇప్పుడొచ్చి తమ ఖాతాలో వేసుకుని రాష్ట్రంలో చోటు దక్కించుకునేందుకు మోడీ మరోసారి కుట్ర పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు చూస్తూ ఉరుకోరంటూ ఆయన హెచ్చరించారు.