తెలంగాణ పంచాయితీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. కొడంగల్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధులని గెలిపించుకోవడానికి స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కొన్ని గ్రామాల్లో ఆయన ప్రచారం కూడా చేసి కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు. ఈ ఎన్నికల్లో రేవంత్ తన సత్త చాటారు అంటున్నారు ఆయన అభిమానులు.
ఎందుకంటే…కొడంగల్ పరిధిలో 30 గ్రామ పంచాయితీలు ఉండగా కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. టీఆరెస్ 6 గెలవగా, 3 చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దీంతో టీఆరెస్ కు బిగ్ షాక్ తగిలినట్టైంది. అధికార ప్రభుత్వం టీఆరెస్ అయినప్పటికీ కాంగ్రెస్ 21 పంచాయితీల్లో గెలవటం రేవంత్ చరిష్మాకి నిదర్శనం అంటున్నారు రేవంత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో వారు మరో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలట్ వోటింగ్ కాబట్టి ఎన్నికల రిజల్ట్స్ లో గోల్ మాల్ జరగలేదంటున్నారు. ఈవీఎం వోటింగ్ వలనే రేవంత్ ఓడిపోయారు. ఈవీఎం టాంపరింగ్ వలనే పట్నం నరేందర్ గెలిచాడని లేదంటే ఇది అసంభవం అంటున్నారు.
అయితే రేవంత్ కూడా ఎన్నికల సమయంలో కొడంగల్ లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈవీఎం టాంపరింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు హై కోర్టులో పిటిషన్ కూడా వేశారు. పట్నం నరేందర్ ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పంచాయితీ ఎన్నికల్లో ప్రచారం చేయడం కొడంగల్ వ్యాప్తంగా కొత్త ఒరవడి సృష్టించింది. ఈవీఎం టాంపరింగ్ విషయమై హైకోర్టులో పిటిషన్ వేసి సంచలనం సృష్టించిన ఆయన ముందు ముందు తనదైన శైలిలో టీఆరెస్ వ్యవహారశైలికి అడ్డుకట్ట వేస్తారని రేవంత్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.